పుట:Hello Doctor Final Book.pdf/409

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గులాబి రంగు గుండ్రని మచ్చలు కలుగుతాయి. కొందఱిలో వ్యాధి రోమకూపములలోనికి చొచ్చుకొని తాపము కలుగజేసి చిన్న చీముపొక్కులను (pastules), పుళ్ళను (furuncles) కలిగిస్తాయి. కొందఱిలో తాప ప్రక్రియ హెచ్చయి పుళ్ళతో మెత్తని ‘రోమ కూప శిలీంధ్ర వ్రణములు (Kerions) ‘ఏర్పడుతాయి. చర్మపు లోపలిభాగములలో తాపము వ్యాపించినపుడు ఎఱ్ఱని దళసరి కణుతులు (nodules) ఏర్పడవచ్చును. ఈ వ్యాధి వలన దురద కలుగుతుంది. తాపము గడ్డపు క్రింద రసిగ్రంధులకు (lymph glands) వ్యాపిస్తే అవి వాచుతాయి. జ్వరము కూడా రావచ్చును. వ్యాధి నిర్ణయము :

అనుభవజ్ఞులైన వైద్యులు చూచి వ్యాధిని చాలా పర్యాయములు నిర్ణయించగలరు. చర్మమును శస్త్రకారుల  చురకత్తితో గోకి వచ్చిన పొట్టును గాని, వెండ్రుకలను పీకి గాని వాటికి పొటాసియమ్ హైడ్రాక్సైడు చుక్కలు వేసి సూక్ష్మదర్శిని క్రింద పరీక్షించి శిలీంధ్రపు పోగులను (hyphe) గుర్తించి వ్యాధిని నిర్ణయించవచ్చును. చర్మము నుంచి, వెండ్రుకల నుంచి  ప్రయోగశాలలలో శిలీంధ్రములను పెంచవచ్చును (fungal cultures). వ్యాధికి లోనైన చర్మభాగములతో కణపరీక్షలు (biopsies) చేసి కూడ వ్యాధిని నిర్ణయించవచ్చును. చికిత్స :

గడ్డపు తామర ఆరంభదశలో ఉన్నపుడు ఆ ప్రాంతమునకు, పరిసర ప్రాంతములకు క్లోట్రిమజాల్ (Clotrimazole) గాని, మికనొజాల్ (micanozole), గాని, టెర్బినఫిన్ (terbinafine) గాని లేపనములను  (anti fungal creams) రెండు నుంచి నాలుగు వారములు  రాస్తే వ్యాధి నయము కావచ్చును. గడ్డము గీసినపుడల్లా కొత్త చురకత్తులు వాడాలి, లేకపోతే శుభ్రపఱచినవాటిని వాడుకోవాలి. పెంపుడు జంతువులను జంతు వైద్యులచే పరీక్ష చేయించి వాటికి శిలీంధ్రవ్యాధులు ఉంటే తగిన చికిత్స చేయించాలి. సాధారణముగా గడ్డపుతామర  లేపనములకు నయము కాదు. రెండు వారములలో సత్ఫలితములు కలుగకపోయినా, వ్యాధి తీవ్రత అధికముగా

408 ::