పుట:Hello Doctor Final Book.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇన్సులిన్ ఉత్పత్తి లోపము వలన కలుగుతుంది. వ్యాధిగ్రస్థులలో ఇన్సులిన్ విలువలు తక్కువగా ఉంటాయి. ఇన్సులిన్ తోనే వ్యాధిని నయము చేయగలము. ఈ మధుమేహము ఇన్సులిన్ అవలంబితము (Insulin Dependent). బాల్యావస్థలోను, తరుణ ప్రాయములోను ఈ వ్యాధి ప్రస్ఫుటము అవుతుంది. ఇన్సులిన్ తప్ప యితర మందులు ఈ వ్యాధికి నిష్ప్రయోజనము. 2. రెండవ రకపు మధుమేహము (Type 2 Diabetes mellitus) :

రెండవ రకపు మధుమేహము ఇన్సులిన్ పై ఆధార పడనిది (Type -2 or Non Insulin Dependent). దీనిని వయోజనులలో చూస్తాము. స్థూలకాయులలో, ఇన్సులిన్ సమర్థత తగ్గుట వలన ఈ వ్యాధి కలుగుతుంది. అంత్యదశలలో తప్ప ఇన్సులిన్ ఉత్పత్తి బాగానే ఉంటుంది. ఇన్సులిన్ కి అవరోధము (Resistance) పెరిగి, దాని సమర్థ త తగ్గి మధుమేహము కలుగుతుంది. జీవనశైలి మార్పులు, నియమితాహారము, వ్యాయామములు వ్యాధి నివారణకు, వ్యాధిని అదుపులో ఉంచుటకు తోడ్పడుతాయి. మెట్ ఫార్మిన్ (metformin). ఇన్సులిన్ స్రావకములు (Insulin Secretagogues), ఇన్సులిన్లను అవసరము బట్టి వ్యాధిని అదుపులో ఉంచుటకు వాడుతారు. కారణములు :

(1) మొదటి రకపు మధుమేహవ్యాధి జన్యుసంబంధమైనది. శరీరరక్షణ వ్యవస్థ స్వయంప్రహరణము వలన (Autoimmune process), క్లోమములోని బీటా కణములు నాశనమగుటచే ఇన్సులిన్ ఉత్పత్తి వీరిలో లోపిస్తుంది. (2) రెండవ రకపు వయోజన మధుమేహము కూడా వంశపారంపర్యముగా వచ్చే జన్యుసంబంధము కావచ్చును. కాని జీవనశైలి, వ్యాయామ లోపము, మితము మించి తినుట, చక్కెర పానీయములు, చక్కెర తినుబండారములు, మితిమీరిన క్రొవ్వు పదార్థపు వాడుకలు (ముఖ్యముగా సంతృప్తపు క్రొవ్వులు), ధూమపానము, మితము మించి మద్యము తాగుట, స్థూలకాయములు ఈ మధుమేహము కలుగుటకు ఎక్కువగా తోడ్పడుతాయి. కణాలలో ఇన్సులిన్ గ్రాహకముల (Receptors)

29 ::