పుట:Hello Doctor Final Book.pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మనందఱికీ కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కారణాల వలన విచారము కలిగినా, ఆ కారణాలు తొలగుట వలన, లేక కాలము మాన్పుట వలనో ఆ విచారము క్రమముగా మరుగవుతుంది. అది సహజ సిద్ధమైన విచారమే కాని రుగ్మత కాదు. ఆ విచార సందర్భములను ఎదుర్కొని, సంబాళించుకొని చాలామంది జీవితమును కొనసాగిస్తారు. అది సహజము. అట్లు కాక దిగులు జీవనవృత్తికి ప్రతిబంధకము  కావచ్చును. అప్పడు ఆ విషాదమును రుగ్మతగా పరిగణించవలసి ఉంటుంది. పెనుదిగులు ( Major depression ) :

ఈ మానసికపు దిగులునకు గుఱి అయిన వారిలో విచారము, అనాసక్తి, ఆందోళన, చిరాకు, ఎక్కువగా ఉంటాయి. వీరికి  జీవితములో సుఖములపైనా సంతోషకరమైన విషయాలపైనా ఆసక్తి ఉండదు. బంధుమిత్రులకు దూరమయి ఒంటరులు అవుతారు. నిరాశ, నిస్పృహ, నిరుత్సాహములకు లోనవుతారు. వీరి ఆత్మవిశ్వాసము సన్నగిల్లుతుంది. తాము నిరుపయోగులమనే భావన కలిగి ఉంటారు. ఏదో అపరాథ భావనలచే పీడితులవుతారు. ఏవిషయముపైన నిమగ్నత చూపించలేరు. నిర్ణయాలు చెయ్యలేరు. మఱపు పెరుగుతుంది. విపరీతపు కుంగు ఉన్నవారిలో మతిభ్రంశము కూడా కలుగవచ్చును.  విపరీతమైన నీరసము, నిద్ర ఎక్కువ అగుట, లేక నిద్ర పట్టకపోవుట, ఆకలి తగ్గుట, లేక హెచ్చగుట, బరువు తగ్గుట, లేక  పెరుగుట కలుగుతాయి. రాత్రింబవళ్ళ తేడా జీవితములో తగ్గుతుంది. వీరికి మరణపు ఆలోచనలు తఱచు కలుగుతుంటాయి. కొందఱు  మాదకద్రవ్యాలు, మద్యపాన దుర్వినియోగాలకు పాల్పడుతారు. కొందఱిలో దిగులు లక్షణాలు పొడచూపక, వేఱే బాధలతో వారు వైద్యులను సంప్రదిస్తారు. అలసట, నీరసము, తలనొప్పి, కడుపునొప్పి, నడుము నొప్పి ,ఆయాసము, గుండెదడ వంటి బాధలు చెబుతారు. కాని ఆ బాధలు ఒక వ్యాధి లక్షణాలలో ఇమడవు. సాధారణ వ్యాధులకు ఇచ్చే ఔషధాలతో ఆ బాధలు నివృత్తి చెందవు. కొందఱు ఆందోళనతో వస్తారు. ప్రతి చిన్న విషయానికి గాభరా, భయము, ఆందోళన పడతారు. వీరి ఆందోళన అవసరానికి మించి ఉంటుంది.

281 ::