పుట:Hello Doctor Final Book.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శస్త్రచికిత్సలు

కంఠధమనిలో పలక (plaque) ఏర్పడి రక్తనాళము 60 శాతము మించి సంకోచించిన వారిలో (Carotid artery stenosis  > 60%) ఆ పలకను తొలగించే  శస్త్రచికిత్స (Carotid endarterectomy) మస్తిష్క విఘాతములు కలిగే అవకాశములను తగ్గిస్తుంది. శస్త్రచికిత్స వలన 3-4% మందిలో ఉపద్రవములు  కలుగవచ్చును. చిన్నమెదడులో విఘాతముల (cerebellar strokes) వలన  వాపు కలిగి మెదడు మూలముపై (brainstem) ఒత్తిడి పెంచినా, నాడీద్రవ ప్రసరణకు భంగము కలిగించి జలశిరస్సును (hydrocephalus) కలిగించినా అత్యవసర శస్త్రచికిత్సలు అవసరము.

వ్యాయామ చికిత్స ( physical therapy ), వాగ్చికిత్స ( speech therapy ), వృత్తి చికిత్స ( occupational therapy ) :

మస్తిష్కవిఘాతములు కలిగిన వారికి వ్యాయామచికిత్స, వృత్తిచికిత్స కండరములలో శక్తిని పెంచుటకు, నడకతీరు సరిచేయుటకు, దైనందిన కార్యక్రమములు చేసుకొనుటకు  తోడ్పడుతాయి. వాగ్చికిత్సలో (మాటల శిక్షణ/speech therapy) ముఖ కండరములకు, నమలు కండరములకు (muscles of mastication), మ్రింగు కండరములకు (muscles of deglutition), నాలుక కండరములకు శిక్షణ ఇస్తారు. నివారణ :

అరవై శాతపు మస్తిష్క విఘాతములు ధమనీకాఠిన్యము (atherosclerosis) వలన కలుగుతాయి. అందువలన రక్తపుపోటును అదుపులో ఉంచుకోవాలి. మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచుకోవాలి. కొలెష్టరాలు అధికముగా ఉంటే దానిని తగ్గించుకోవాలి. పొగ త్రాగకూడదు. ఊబకాయమును తగ్గించుకోవాలి. తగినంత వ్యాయామము చేస్తుండాలి. ఈ

268 ::