పుట:Hello Doctor Final Book.pdf/225

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎకాంప్రొసేట్ ( Acomprosate ) :-

మద్యపానము విడనాడిన తర్వాత కలుగు పరిణామములను అరికట్టు టకు, మద్యపానమును తగ్గించుటకు, అరికట్టుటకు యీ ఔషధము ఉపయోగ పడుతుంది. ఎకాంప్రొసేట్  మద్యపానము విరమించుకున్నవారిలో గ్లుటమేట్ (glutamate) ప్రభావమును అణగతొగ్గుతుంది. మూత్రాంగ వ్యాధిగ్రస్థులు ఎకాంప్రొసేట్ వాడకూడదు. డై సల్ఫిరామ్ ( Disulfiram ) :-

మద్యపానమును అరికట్టుటకు ఏంటబ్యూజ్ గా (Antabuse) ప్రసిద్ధికెక్కిన డైసల్ఫిరామ్ మరిఒక ఔషధము. మద్యము (ఇథైల్ ఆల్కహాలు, CH3-CH2-OH) కాలేయములో జీవవ్యాపార క్రియచే విచ్ఛిన్నము అవుతుంది. ప్రప్రథమముగా ఆల్కహాల్ డీహైడ్రోజినేజ్ (Alcohol dehydrogenase) అనే జీవోత్ప్రేరకము (enzyme) వలన ఎసిటాల్డిహైడ్ గా (acetaldehyde; CH3-CH-O) మారుతుంది. ఎసిటాల్డిహైడ్, ఆల్డిహైడ్ డీహైడ్రోజినేజ్ (Aldehyde dehydrogenase) అనే జీవోత్ప్రేరకము వలన  ఎసిటేట్ గా (CH3-COO) మారి ఆపై  బొగ్గుపులుసు వాయువు (CO2), నీరుగా విచ్ఛిన్నము అవుతుంది.

డైసల్ఫిరామ్ (Disulfiram) ఆల్డిహైడ్ డీహైడ్రోజినేజ్ ని అణచి ఎసిటాల్డిహైడ్ విచ్ఛిన్నమును మందగింపజేస్తుంది. అందుచే డైసల్ఫిరామ్ తీసుకొని మద్యపానము చేసేవారిలో ఎసిటాల్డిహైడు కూడుకొని,  శరీరము ఎఱ్ఱబారుట (flushing), తలనొప్పి, వాంతులు కలుగుతాయి. డైసల్ఫిరామ్ తీసుకొనేవారు  మద్యము త్రాగుటకు ఇచ్చగింపరు. డైసల్ఫిరామ్ మరిఒకరు పర్యవేక్షిస్తూ ఇవ్వాలి. డైసల్ఫిరామ్ కాలేయములో విచ్ఛిన్నమవుతుంది. కాలేయ వ్యాధులు కలవారు ఈ ఔషధము, ఇతర ఔషధముల వాడుకలోను జాగ్రత్త వహించాలి. డైసల్ఫిరామ్ వాడేవారు ఆల్కహాలు ఉండే పుక్కిలింత ద్రవములు, జలుబు మందులు వాడకూడదు. కాల్సియమ్ కార్బిమైడ్ (Calcium Carbimide) కూడా డైసల్ఫిరామ్ వలె పనిచేస్తుంది.

224 ::