పుట:Gurujadalu.pdf/653

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విద్యా పునరుజ్జీవనము విద్యలలోనూ, కళలలోనూ మునపటి గ్రీకులు సాటిలేనివారై యుండేవారు. గ్రీకుల స్వాతం త్ర్యము సన్నగిలిన తరువాత రోమనులు తలయెత్తి ఆనాటి లోకమును ఏకఛత్రంగా యేలిరి, గాని విద్యలలో గ్రీకుల చాయను బట్టి పోయిరి. కొంతకాలానకు, ఇటలీ దేశము కిరాతులు జయించడమూ, రోమనులు కిరస్తానులు కావడమూ జరిగింది. కిరస్తానులకు కిరాతులకు గ్రీకుల విద్యలయందు ఆదరం లేక దేశం కొన్ని సంవత్సరములు అజ్ఞానాంధకారం కమ్మి వుండినది. అంతట కొన్ని కారణముల చేత ఇటలీలో జాత్యభిమానమూ, దేశాభిమానమూ మొలకెత్తి బలిసినది. పాత విద్యలు నేర్చను అభిలాష కలిగినది. ఆ సమయంలో యిస్తంబూల్ తురకల పాలుకాగా, అక్కడి గ్రీకుపండితులు కొందరు యిటలీకి వచ్చి అక్కడి ప్రభువులవల్ల మన్ననలంది, గ్రీకు విద్యలను తిరిగి లేవనెత్తిరి. దీనినే “రివైవల్ ఆఫ్ లెటర్స్” (Revival of letters) అని అంటారు. యూరోపుఖండం అజ్ఞానంలో నుండి మేలుకోవడం అప్పుడే. అదివరకు టోపీ జాతులవారు కిరస్తానీ మతమే నిజమైన మతమనిన్ని, విగ్రహారాధన చేసే గ్రీకు, రోమనుల విద్యలలో విలవ వుండనేరదనీ, వారి విద్యలు చదువుటే పాపమనీ నమ్మి వుండేవారు. ప్రజలకు విద్య నేర్పితే దేశం బాగుపడునన్న జ్ఞానం లేకపోయెను. బైబిలు నిర్జీవమైన లాటిను భాషలో చదివే వారు. దైవ ప్రార్థనలు కూడా ప్రజలకు అర్థముకాని లాటిను భాషలోనే వుండేవి. బయిబిలు దాటి సత్యమూ, జ్ఞానమూ లేదనిన్ని, విగ్రహారాధకులై వుండే గ్రీకు, రోమనులు మూర్ఖ్యులనిన్నీ కిరస్తానులు నమ్మేవారు. ఇటలీలో గ్రీకు, లాటిను సరస్వతి ఉదయించగానే జనులకు కళ్ళ మసక మాసినది. బుద్ధిమంతులు కిరస్తానుల మోటతనమూ, మూర్ఖమూ, విగ్రహారాధకులై వుండిన గ్రీకు లాటినుల జ్ఞానమూ, కళాకౌశలమూ చూడగలిగిరి. యూరోపులో బుద్ధికి గొలుసులు విడినవి. గ్రీకు, లాటిను విద్యలను చేపట్టుట పరువు ప్రతిష్టలకు తెరువైంది. వాటి రసానకులోనై విద్వాంసులు దేశభాషను నిరసించేవారు. గాని దేశాభిమానమూ, జాత్యభిమానమూ ప్రబలుట చేత దేశ భాషలో చెయిపట్టి రాయించింది. ఆ కథ ముందు చెబుతాను. విద్యా పునరుజ్జీవనము గురుజాడలు 608