పుట:Gurujadalu.pdf/627

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాటకములు గ్రామ్యభాషనే వ్రాయనగుననుటకు అంగీకరించని వారు ఉండబోరు. స్వభావము ననుసరించి వాడుకలో నుండు మాటలతో వ్రాయబడుటం జేసి, యీ నాటకమున భాష ముద్దులు మూటకట్టుచున్నది. కన్యాశుల్కమున కాశించి వృద్ధులకు పిల్లలనిచ్చు దురాచారమును మాన్పుటకై యీ నాటకము వ్రాయబడినది. కృష్ణారాయపురమను నగ్రహారమున నగ్నిహోత్రావ ధానీ యను బ్రాహ్మణుడు కలడు. ఆయనకిద్దరు పుత్రికలు. పెద్దపిల్లను కన్యాశుల్కమున కాశించి వృద్ధున కొకనికి కట్టబెట్టుటంజేసి, ఆమెకు బాల్యమునందే వైధవ్యము సంభవించినది. అంతటను బుద్దిరాక రెండవ పిల్లను గూడ లుబ్ధావధానులను నొక ముసలివానికి పెండ్లి చేయుటకు అవధానులు గారు తలపెట్టిరి. ఈ వివాహము విఘ్నముచేయుటకుగాను ఆయన బావమరది యగు కరటకశాస్త్రి తన శిష్యునకొకనికి స్త్రీ వేషము వేసి తక్కువ వెలకు ఆ లుబ్ధావధానులకు పెండ్లి చేయును. వివాహమైన కొద్ది దినములలో నా శిష్యుడు వేషము విప్పి పారిపోవును. ఇటుల పెండ్లికూతురు అదృశ్యముకాగానే, ప్రాణహత్య జరిగినదని పోలీసువారు క్రిమనలు కేసును లేవనెత్తుదురు. ఈ రసకందాయములో నగ్నిహోత్రావధాని పుత్రునికి విద్యనేర్పు గిరీశ మను మోసగాడొకడు అవధానులుగారి జ్యేష్ఠపుత్రికను పెండ్లికిబోవు మార్గమధ్యమున లేవతీసుక పోవును. దీనంజేసి చిలవపలవలుగ కోర్టు చిక్కు లెన్నియో పుట్టి, న్యాయమార్గానువర్తియగు నొక బ్రాహ్మణోత్తమునిచే బాపబడును. గ్రంథము చదివి చూడవలెగాని, చెప్పి తెలుపశక్యమైనది కాదు. షేక్స్పియరు మహాకవి నాటకములలోని ఫాల్ స్టాఫ్ అను పాత్రమువలె, నీ నాటకమున గిరీశమను నతడు నవ్వులబండి. కావ్యగుణములన్నిటికన్నను లలితమగు హాస్యరసము కష్ట సాధ్యమని యాంగ్లేయ పండితుల యభిప్రాయము. అట్టి సరసమగు హాస్యము యీగ్రంథమంతట నిండియున్నది. కాన నీకవిని ఆంధ్రమోలియరని యనతగియున్నది. అంకితమును, ఉపోద్ఘాతము లును ఇంగ్లీషు భాషను వ్రాయబడియున్నవి. తెనుగున వ్రాసిన బాగుండునని మా యభిప్రాయము. ఈ గ్రంథమును ఆనందగజపతి మహారాజుల సుందరరూపమును తెలుపు పొటిపొకటి యలంకరించుచున్నది. గ్రంథము వెల ౧౨ అణాలు. ఇది చెన్నపురి ఎప్షనేడులో సంస్కృతాంధ్ర గ్రంథముల విక్రయించు వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్సు వారి షాపునను, తెలుగు దేశమునగల రెయిలు స్టేషనులలో హిగ్గిన్ బాతం కంపెనీవారి పుస్తకముల యంగళ్ళవద్దను దొరుకును.


గురుజాడలు

582

కన్యాశుల్కము