పుట:Gurujadalu.pdf/592

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మెటిల్‌డా

నేను వృక్షశాస్త్రము యమ్‌.యే పరీక్షకు చదువుతూ వుండే రోజులలో మైలాపురి పెద్ద రోడ్డున ఒక మిద్దె యింట్లో బసచేసి వుంటిని. నాతో పాటు పది పన్నెండుగురు విద్యార్థులు మనదేశపు వాళ్ళు ఆ మేడ యింట్లో ఉండేవారు.

నేను వచ్చినమూడో రోజున రామారావు నన్ను సౌజ్ఞ చేసి పిలిచి రహస్యంగా మెటిల్డాను చూశావా? అని అడిగాడు. "లేద"న్నాను. "అదుగో... చూసీ చూడనట్టు చూడు" అని చూపించాడు.

చూశాను.

"చాలు, యికరా" అన్నాడు.

మెటిల్డా వైపు తిప్పిన మొహం తిప్పకుండానే యెలా రావడం: కళ్ళు భగవంతుడు యిచ్చినందుకు యిదే కదా ఫలం-మనోహరమైన భగవంతుడి సృష్టిలోకల్లా మనోహరమైనది సొగసైన స్త్రీ. మనస్సులో చెడుచింత లేనప్పుడు చూస్తే తప్పేమి? అన్నాను.

నీలా శ్రీరంగ నీతులు చెప్పిన వాళ్ళని చాలా మందిని చూశాను. కొత్తవాడివి యెరిగివుంటే మంచిదని చూపించాను. మరి యెన్నడూ యిటు కన్ను తిప్పకు అని రెక్క పట్టుకు గెంటుక పోయినాడు.

"మంచి మనిషా, చెడ్డ మనిషా?" అని అడిగాను.

మంచయితే మనకేల? చెడ్డయితే మనకేల? ఒకర్ని మంచి కాదండానికి మన మంచేం తగలడుతూంది? మెటిల్డా వైపు చూడవలెనని తిరిగి యెన్నడైనా చూస్తివా నీకూ నాకూ నేస్తం సరి అన్నాడు. రామారావు నాకు ప్రాణసమానమైన మిత్రుడు. యేం చెయ్యను, మనసు నిరోధించి మెటిల్డా యింటి పెరటి వేపు వున్న డాబా పొంతకు నే వెళ్ళలేదు, కొన్నాళ్ళు.

పసుపు రాసుకొని స్తానమాడిన పైని బంగారు చాయలు దేరిన మేని సొంపు, నెమలి పింఛమువలె ఒడలును కమ్మి చెదిరిన తలకట్టూ, బావి నుంచి నీరు తోడిన వయ్యారమూ, 'తోడుతూ వొక్కొకతరి తలయెత్తి యిటు అటూ చూసిన కన్నుల తళుకూ, మోము అందమూ నా కన్నులు కట్టినట్టు వుండి మరుతునన్న మరపు రాకపాయను.

గురుజాడలు

547

మెటిల్‌డా