పుట:Gurujadalu.pdf/593

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వారం పది రోజులు కట్టుమీద ఉన్నాను. ఆపైన మనసు పట్టలేక పచారు చేస్తూ చదివే మిష మీద, చేత పుస్తకం, దృష్టి పెరటి వైపూ వుంచి డాబా మీద గస్తు తిరిగే వాణ్ణి రామారావు యింట లేనప్పుడు.

ఆ రోజుల్లో రెండు మార్లే యేదో పని మీద పెరట్లోకి వచ్చి వెంటనే యింట్లోకి వెళ్ళిపోతూ వచ్చింది - మెరుపులా.

కాలేజీకి వెళ్ళేటప్పుడు మెటిల్డా యింటి యెదట చీమలాగ నిమ్మళంగా ఆ యింటివేపు చూస్తు నడిచేవాణ్ణి అప్పుడప్పుడు చిత్తరపు చట్రంలా ప్రతిమలాగ, గవాక్షంలోంచి మెటిల్డా కనపడేది.


2


మెటిల్డా చరిత్ర అడిగి వారి వల్లా, వీరి వల్లా, అడక్కుండా నా నేస్తాల వల్లా గ్రహించాను.

మెటిల్డా పెనిమిటికి మా వాళ్ళు పులి, ముసలి పులి అని పేరు పెట్టారు. అంత ముసలివాడు కాడు. యాభై అయిదు, యాభై ఆరు యీడు వుండువచ్చును. కొంచెం తెల్లగా, పొట్టిగా వుంటాడు. పెద్ద కళ్ళూ, కోర మీసాలు, స్ఫోటకం మచ్చల మొహం రెండేళ్ళాయ వచ్చి మా ప్రక్క బంగళాలో బసవేశాడు. యెక్కణ్ణించి వచ్చాడో యెందుకు వచ్చాడో యెవరూ యెరుగరు. వీధి వేపు పెరటిలోకి వొరసుకొని పెద్ద గది వొకటి వుంది. దానిలో మూడు బీరువాలతో పుస్తకాలు వున్నాయి. అమేషా రాస్తూనో, చదువుతూనో కనుపడేవాడు. వీధి పెరటిలోనూ, వెనక పెరటిలోనూ పూల చమన్‌ బహు సొగసుగా వుంచేవాడు. ఉదయం, సాయంత్రం మొక్కలకు గొప్పు తవ్వేవాడు. మెటిల్డా మొక్కలకి నీరు పోసేది. ఇది యింగ్లీషు పద్ధతి ప్రకారం యిద్దరికీ శరీర వ్యాయామం. అంతే మరి యిల్లు కదలి నాలుగు అడుగులు పెట్టడమన్నది లేదు. యింటికి చుట్టాలూ, పక్కాలూ రాకపోకలు యెన్నడూ లేదు. పులి మెటిల్డాని యెక్కువ కాయిదా పెట్టేవాడు. గుమ్మంలోకి రాకూడదు అని శాసనంట. గాని అప్పుడప్పుడు వచ్చేది. ఆ పిల్ల మొఖాన వొక మోస్తరు విచారం కనపడేది. వింతేమి? మొగుడు కంట్రక పెట్టేవాడు. మొగుడి అప్ప ( అక్క) ఒక ముదసలి, చిలిపి జగడాలు పెట్టేది. ఇంటిలో మిగిలిన వాళ్ళు ఒక ముసలి వంట బ్రాహ్మణుడు.

మెటిల్డా పెనిమిటిని పులి, పులి అనడమే గాని అతని పేరేమిటో యెవడూ యెరగడు. పోస్టు బంట్రోతు ఆయన పేర వచ్చిన ఉత్తరముల పై విలాసం ఎవరికీ చూపకుండా నిర్ణయం అట. ఒక్క పోస్టు మేష్టరికీ, పులికీ మాత్రం పరిచయం వుందని అనుకునేవారు.

అది రహస్యం కాపాడడం కోసమే ఉంటుంది.