పుట:Gurujadalu.pdf/534

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రత్నాంగి కొవ్వొత్తి వెలుతుర్ని - జాడీ నాలుగు మూలల తొంగి చూచి - తలయెత్తి - యింతే - మరిలేదు - యేవఁనుకుంటావు? యిరవై ముఫ్ఫై వేలకు చేకురుతుంది. యింత గణించిందని, యవరూ యెన్నడూ అనుకోలేదు. బతికి నిన్ను బాధ పెడితే పెట్టింది కాని చచ్చి నీకు కనకాభిషేకం చేసింది. లోకం కోసమయినా కంటతడి పెట్టావు కావు.

మంజు : చచ్చిందని సంతోషించుతూ కంట నీరు పెట్టడం యెలాగ?

రత్నాంగి : నవ్వులు, కన్నీళ్ళు, భోగం దానికి తలిచే టప్పటికి రావద్దా?

మంజు : నేను భోగం దాన్నా?

రత్నాంగి:నాలుగేళ్ళు సానెరికం చేసి, యింకా సంసార్ని అనుకుంటానా?

మంజు : నమ్మక స్వామిద్రోహము చేసి నన్ను అమ్మి కొండుభొట్లూ, డబ్బిచ్చి కొని రామసానీ నాలుగేళ్ళు యీ చెరలో పెట్టారు - దేవుడు యిన్నాళ్ళకి చేరవొఁదిల్చాడు. యీ డబ్ళు నాకు యివ్వాలని ఆ పిశాచం యిచ్చిందా యేమిటి? యీ డబ్బు నాకు దేవుడు యిచ్చాడు. నన్ను బెట్టి అది యెంత ఆర్జించింది? యిక స్వేచ్ఛగా బతుకుతాను.

రత్నాంగి : అనగా?

మంజు : వొకరి బాధ లేకుండాను.

రత్నాంగి : యెవరి బాధ?

మంజు : రామసాని బాధ వొదిలిపోయింది - యిక పంతులు బాధ.

రత్నాంగి: (జాడీలో సరుకులు ఉంచడం మాని నిలిచి) నా మాట కొంచెం వింటావా?

మంజు : నీకంటె నా మంచి కోరిన వారెవరున్నారు.

రత్నాంగి : అట్టి నమ్మకం వుంటే పది రోజుల కాలం పాటీ తోవనే జరగనీ.

మంజు : అయితే నీ యిష్టం.

రత్నాంగి:అలసివున్నావు. వెళ్ళి పడుకొని నిద్దర తెచ్చుకో.

మంజు : అలాగె, కాని నిద్దర రావడం యెలాగ? యీ మంచం మీద యింకా పడుకుందేమో అని బితుకు వేస్తూంది. దేయ్యవైందేమో?

రత్నాంగి:చచ్చిన వుత్తర క్షణం వెర్రి కుక్కయి పుట్టి వుంటుంది. మనుషుల్ని పీక్కుతినే పిసినిగొట్లకు అదే గతి. ఆంజనేయ దండకం చదువుకుంటూ పడుకో (మంజువాణిని కాగలించుకొని జుత్తు సవరించి ముద్దు పెట్టుకొని) వెళ్ళు, పడుకో.

మంజు : నీకీ రాత్రి జాగరవేఁనా?

గురుజాడలు

489

కొండుభొట్టీయము