పుట:Gurujadalu.pdf/473

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మాధ : చాల్చాలు, నీ కుతర్కం చాలించు.

(కవి కృష్ణస్వామి ప్రవేశించును, మాధవశర్మ అతనికి యెదురుగా వెళ్ళి, )

మాధ : విన్నారా?

కృష్ణ : చూచాయగా.

మాధ : (నారాయణభట్టుతో) చూశారా, అప్పుడే వూరందరికీ తెలిసింది. (కృష్ణస్వామితో) ఆ వుత్తరాది వాడు మీకంటే పెద్ద కవిషండీ?

కృష్ణ : పెద్ద కేవుఁంది; అందరికంటే తాటిచెట్టు పెద్ద. కవిత్వం ఒక పాటిగా చెబుతాడు;గాని పండితుడు.

మాధ : పండితుడే కాగట్టండి! ఒకపాటి కవి కాదు మహాకవే అనండి. రాజపుత్రికలకు, తరతరాలనుంచి ఆస్థానం కనిపెట్టుకొని కాలం గడిపిన మీ, నా, బోటివారు విద్య చెప్పడం భావ్యం గాని, శీలం యెట్టిదో, సాంప్రదాయం యెట్టిదో, తెలియని దిక్కుమాలిన పరదేశిని అంతఃపురంలో ప్రవేశపెట్టడం ఉచితమేనా?

కృష్ణ : ఆ మాట అన్నారు, ఒప్పుకున్నాను.

మాధ : (మెల్లగా) మాట వరసకు అనుకుందాం. బిల్హణుడు జారుడైతే?

కృష్ణ : మీ పుట్టేం ములిగింది? రాజు అనుభవిస్తాడు.

మాధ : ఈలోగా యీ అవమానవఁంతా నేను అనుభవించాలి గదండీ!

కృష్ణ : మానావమానములు వకడు యిస్తేనా వస్తవి? రాజుటండీ బుద్ది యొక్కా విద్యయొక్కా విలువ కొల్చేవాడు? లేకుంటే, ఆ రామశాస్తులు సొట్ట కవిత్వం మెచ్చుతాడు గదా, రాజు తెలివి యేమని చెప్పను! |

మాధ : అయితే యిప్పుడు మనం యేం జేయడం, మీ సలహా.

కృష్ణ : సలహా కేవుందీ? మాట్లాడక ఊరుకోవడవేఁ సలహా.

మాధ : యీ అప్రతిష్ఠ సహించి యేలా వూరుకోవడం? నాలుగు మాసములు శలవు పుచ్చుకునీ తీర్థయాత్రలు వేళుదునా?

కృష్ణ : వెళ్ళండి.

మాధ : (మెల్లగా) ఆహవమల్ల మహారాజు పట్టపుదేవి తరుచు వర్తమానం చేస్తూన్నారు. వస్తే నాలుగు గ్రామాలు అగ్రహారంగా దయచేయిస్తానన్నారు.

కృష్ణ : అలాగైతే యింకా ఆలోచిస్తారేవిఁ?

(వైయాకరణులు జిన చంద్రుడును గోవింద శాస్త్రియును ప్రవేశింతురు.)

గురుజాడలు

428

బిల్హణీయము