పుట:Gurujadalu.pdf/460

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఆ రాయబారి మోసుకువచ్చే మాటలకు రాయబారిని తప్పుపట్టడం ధర్మం కాదు. యివి జరిగే మాటలని నేను మనవి చెయ్యలేదు. వున్నమాట మనవి చేస్తే, వకీళ్లు గనక వేశ్య పెట్టిన చిక్కు, విప్పజాలకపోతారా అని మనవి చేశాను. సౌజ : వేశ్యలకు వకీళ్లు సమదంతా అనా? (నవ్వి) నేను మట్టుకు వోడిపోయినానని వొప్పు గుంటున్నాను. యెగతాళీలో దించకండి- వేశ్య డబ్బాల్లకపోదు. ద్రవ్యం కోరమనండి, ఆయనైనా యిస్తారు, నేనైనా యిస్తాను. కొత్త మనిషి : అందాకా యెందుకండి? తమదాకా అక్కరలేదు. బ్రాహ్మడికి ఉపకారార్థం నేనేయిస్తును. ఆ మనిషి ద్రవ్యానికి సాధ్యురాలు కాదని మనవి చేశాను; నమ్మరా? సౌజ : అన్నట్టూ, మీరు గిరీశం గారి శిష్యులమంటిరికదా? మీరు యాంటినాచ్ కారా? అయితే, వేశ్యవల్ల యీ భోగట్టా యావత్తూ మీకు యెలా వొచ్చింది? యిదంతా యెగతాళా? కుట్రా? కొత్త మనిషి : నమ్మని వారితో యేమి చెప్పను? యిది కుట్రా కాదు; యెగతాళీ కాదు. నేను అక్షరాలా యాంటీనాచ్ నే. వివేకలేశం వున్నవారు యెవరు యాంటి నాచ్ కారండి? గాని, విధికృతం చేత నాకు వేశ్యాసంసర్గ తప్పింది కాదు. సౌజ : యేవిటో ఆ విధికృతం? కొత్త మనిషి : ఇది! (కొత్త మనిషి నెత్తిని వున్న పాగా తీసి జుత్తును జారవిడచి; వెనకకు తిరిగి తొడుగుకున్న కోటు విడచి, కప్పుకున్న శాలువ వలెవాటుగా వేసికొని సౌజన్యారావు పంతులు వేపు తిరిగి) నా వూరూ పేరూ అడిగితిరి. వూరు విజయనగరం, పేరు మధురవాణి! సౌజ : (మొదట ఆశ్చర్యమగ్నుడై, యోచనపైని కోపావేశము కలిగి నిలిచి) యేమి మోసము జరిగినది! మధు : గురువుల ఉపదేశం గురువులే మరవ కూడదు. చెడ్డలో కూడా మంచి వుండవచ్చును. కాక మంచి చెడ్డలు యెంచేవారెవరు? సౌజ : యేమి దగా! మధు : నిర్మలమైన అంతఃకరణతో వస్తిని, నిజం దేముడెరగవలె. దగా అని తోచినది; యేమి చెయ్యగలను? వెళతాను. సౌజ : శీఘ్రంగా వెళ్లవచ్చును. (మధురవాణి పాగా కోటూ విడిచి గుమ్మము వరకు వెళ్లును. ) కన్యాశుల్కము - మలికూర్పు గురుజాడలు 415