పుట:Gurujadalu.pdf/461

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సౌజ : నిలు-నిలు (మధురవాణి తిరిగి వచ్చి కొంచము యెడముగా యెదట నిలుచును. ) సౌజ : పాగా, కోటూ మరిచిపోయినావు. మధు : అంతేనా? మనసే మరచిపోయినాను; కొదవేవిఁటి? (తిరిగి రెండడుగులు వెళ్లును. ) సౌజ : మాట! మధు : (తిరిగిచూసి) యీ మాటు యేం మరిచానండి! సౌజ : నువ్వు మరవలేదు, నేనే మరిచాను, లుబ్ధావధాన్లు గారి మాటేమిటి? మధు : తమమంచి లోక ప్రసిద్ధమైనప్పటికీ, ఆయనయందు తమకు అట్టే అభిమానం భగవంతుడు పుట్టించలేదు. సౌజ : ఆయనను కాపాడడముకు న్యాయవైఁన పని యేమి చెయ్యమన్నా చేస్తాను. అనేక సంవత్సరములాయ, వేశ్య అన్నది నా యింటికి రాలేదే? నేను వేశ్యతో యెన్నడూ మాట్లాడలేదే? ఈనాటికి ప్రతభంగమైనది గదా, అని అపారమైన విచారములో ములిగివున్నాను. మధు : తమరు ప్రాజ్ఞులు ; వ్రతభంగమేది? సౌజ : నిశిరాత్రివేళ పడకింటిలో వేశ్యను పెట్టుకొని మాట్లాడడం కన్న యింకాయేమి కావలెను? మధు : తమరు నన్ను రప్పించలేదే? వేశ్యలు పార్టీలైతే, వకీళ్లు కేసులు పట్టరో? సౌజ : పడతాం, పట్టం; యేమైనా నువ్వు పార్టీవైనా కావే? మధు : కాను - గాని మీ పార్టీని కాపాడే మనిషిని నేను యెవతెనైతేనేమి-నను చూడకూడదా? అది అలా వుండగా వేశ్యలము దేవాలయములలో భగవంతుణ్ణి చూడడమునకు పోవచ్చును గదా? సత్పురుషులైన తమవంటి వారి దర్శనమునకు మాత్రం నిరోధమా? సౌజ : "మంచివారు, మంచివారు” అని పలుమారు అంటూవుంటే, నాకు లజ్జగా వుంది. ఆ మాట మరి అనకు - చూడరావచ్చును గాని రాత్రివేళ పడకింట్లోనా? మధు : వేశ్యనని వర్తమానం చేస్తే పగటివేళ చూతురో? సౌజ : నా శత్రువులు యెవల్లో నిన్ను నా దగ్గరకు పంపారు (నఖ సిఖపర్యంతం నిదానించి) యెంతటివాళైనా వుంటారు! మధు : అలాగైతే తమమంచే తమకు శత్రువై వుండాలి. మీ కార్యం నిర్వహించి డబ్బు ఒల్లనప్పుడు కుట్రా కూహకం లేదని నమ్ముదురా? గురుజాడలు 416 కన్యాశుల్కము - మలికూర్పు