పుట:Gurujadalu.pdf/359

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రోజూ కందిపప్పు, ధప్పళం ఇయ్యవయ్యా” అని ధ్యానించాలి. మన చమకంలో యేమన్నాడూ? “శ్యామాకాశ్చమే” “చామల అన్నం మామజాగా వుంటుంది, నాక్కావాలి, ఓ దేవుఁడా!” అన్నాడు. ఆ చమకంలో యవడికి యిష్టవైఁన వస్తువులు వాడు కలపవచ్చును "కంది గుండాచమే, యింగువ నూనాచమే” దీనినే రిలిజియస్ రిఫార్ము అంటారు. ఆ వెంకటేశం :గేదె పెరుగూచమే, చేగోడీచమే. గిరీశం: చబాష్! అదే ఒరిజినాలిటీ - అడిగితే గాని అమ్మ అయినా పెట్టదు. దేవుడు మాత్రం ముద్దిస్తాడనుకున్నావా యేమిఁటి? నీకు యెప్పుడు యేమి కావలిస్తే అప్పుడు వస్తువులు సంపుటీ చేసి చమకపారాయణ ఆరంభించేది. వెంకటేశం :అయితే రేపణ్ణించి నేను రోజూ చమక పారాయణ చేస్తాను. గిరీశం: మనస్సులో చెయ్యి. పైకి పారాయణ చేశావంటే, నీ తండ్రి ఎడ్యుకేషన్ లేకపోవడం చేతా, రీజన్ తెలియకా, యిదేవిఁటి చమకం పాడు చేస్తున్నాడని పెణతెక్కగొట్టి, తొమ్మిదో అష్టం ఘనం పారాయణ చేస్తాడు. వెంకటేశం :మొన్న బుగతగారి యింట్లోంచి మీరు పొగాక్కట్ట యెత్తుకొచ్చారు గదా, పాపం చేశారని దేవుఁడు కోప్పడ్డా? గిరీశం : చిన్నతనంలో మా పింతండ్రి (నీ తండ్రి లాగే అగ్గిరావుఁడోయి) చెవి నులిపి నా చేత ఉపనిషత్తులు చదివించాడు. దాం తస్సా గొయ్యా, పేరు మరిచిపోయినాను గాని, ఒక వుపనిషత్తులోను, శిష్యుడు ప్రశ్న అడుగుతూవుంటే, గురువు సమాధానం చెబుతూంటాడు. ఆ వుపనిషత్తులో చెప్పిన శిష్యుల్లాంటి శిష్యుడివి నువ్వు; అలాంటి గురువుని నేను. మన ప్రశ్నోత్తరాలు యవడైనా తాటాకు మీద రాసి పారేశాడంటే, ఒక రెండువొందలేళ్ళు అయిన తరవాత “టొబాకోపనిషత్తు" అవుతుంది. పొగాకు కట్టకి పాపవేఁవిఁటోయి, కాల్చి పారేసేదానికి? అందులో పొడుం చేసే బుద్ధిహీనుల దగ్గర పొగాకు యెత్తుకు రావడం లోకోపకారవఁని నమ్ము. వెంకటేశం :యలాగండి లోకోపకారం? గిరీశం : యలాగా, యిదుగో, యిలా చుట్ట కాలిస్తే, స్టీము యంజన్ లాగ, భగ్, భగ్ మని పొగ ఆకాశానికి పరిగెత్తి మేఘవైఁ వర్షం కురిపిస్తుంది. పొడుం గాని పీలుస్తే ఆ ఘాటుకి, ఆకాశం ఆర్చుకుపోతుంది. ముక్కంట మాత్రం చిరి వర్షం కురిసి యిల్లూ వొళ్లూ కూడా డర్టీ అవుతుంది. గనక పొడుం చేసే మూర్ఖుల యింట్లో వుండే పొగాకంతా గురుజాడలు 314 కన్యాశుల్కము - మలికూర్పు