పుట:Gurujadalu.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దొరికితే కేసొక్క నిముషంలో పోతుందని ఫస్టుక్లాస్ ప్లీడర్ సౌజన్యారావు పంతులుగారు చెప్పారు. గుంటూరు టెలిగ్రాఫిస్తే అక్కడనుంచి యీ మధ్య యవరూ శాస్త్రుల్లు కూతుర్ని తీసుకుని యీ వేపు రాలేదని జవాబు వచ్చింది. వాణ్ణి రప్పించే సాధనం యేమైనా చేయించగల్రూ గురోజీ?

బైరాగి : ఆహా! అదెంతపని, రాత్రి అంజనం వేసి యెక్కడున్నదీ కనుక్కుంటాం.

హెడ్ : దయచెయ్యండి యింటికి వెళదాము.

బైరాగి : యీ శిష్యులక్కొంచం గ్యానోపదేశంచేసి వస్తాను మీరు వెళ్లండి.

హెడ్ : అలాక్కాదు. నేను మీతో కూడా వుంటాను.

(తెర దీంచవలెను.)

డెప్యూటీ కలెక్టర్ మాణిక్యం మొదలికచేరీ (వకీళ్లు, బంట్రోతులు మొదలైనవారు.)

భీమా : నాకు మునసబుకోర్టులో కేసున్నది. కటాక్షిస్తే వొక అర్జీ దాఖలుచేసి శలవు పుచ్చుకుంటాను.

కలెక్టర్ : కోర్టువారికి సావకాశం అయేవరకూ వుండలేని వకీళ్లు కేసు యెందుకు దాఖలు చేయవలె? ఇది చెప్పినట్టల్లా వచ్చే కోర్టనా మీ యభిప్రాయం?

భీమా : చిత్తం, చిత్తం, తమ ప్రిడిశెసర్లు అలాగ్గడుపుతూ వచ్చేవారు.

కలెక్టర్ : ఆఫీస్ పని చూసుకొని పిల్చేవరకూ ఉండండి.

అగ్నిహో : (రామప్పంతులుతో) యేమండోయ్ మన కొత్తవకీల్ని కోప్పడుతున్నారే?

రామప్ప: యీ అధికార్ల నైజం యేమిటంటే యెవళ్లమీద దయుండి యెవళ్ల పక్షం కేస్ చెయ్యాలంటే వాళ్లని కరవ్వొచ్చినట్టు కనపడతారు. మీరు కోర్ట్లసంగతంతా తెలుసునంటారే? యిదేనా మీ అనుభవం?

అగ్నిహో : (కొంచెము గట్టిగా) అవునవున్నాకు తెలుసును.

కలెక్టర్ : యెవరా మాట్లాడుతున్న మనిషి,

నాయడు: (లేచి) తక్‌షీల్ మాప్‌చేస్తే మనవిచేస్తాను. యీయన కృష్ణారాయపురం అగ్రహారంకాపురస్తుడు, నులక అగ్నిహోత్రావధాన్లుగారు, మహాయోగ్యమైన బ్రాహ్మడు, జటాంత స్వాధ్యాయి, యీయనే లుబ్ధావధాన్లుగారికి కొమార్తెని, పద్దెనిమిదివందల రూపాయిలకు, కన్యాదానం చేయడానికి బేరమాడుకుని, కాబోయే అల్లుడికి దేహశుద్ధిచేశారు. అందుకే యీ మధ్య లుబ్ధావధాన్లు గారు యేలినవారి కోర్టులో చార్జీదాఖలు చేశారు. అందులో

గురుజాడలు

199

కన్యాశుల్కము - తొలికూర్పు