పుట:Gurujadalu.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముద్దాయీ యీ మహానుభావుడే! రామవరంలో సహస్రమాసజీవైన వక బ్రాహ్మణ శ్రేష్టుడుంటే ఆయనకు పెద్ద కుమార్తెను కన్యాదానంచేసి, రెండు పిల్లికూనల్ని స్వీకరించేటప్పటికి పెళ్లిలోనే ఆ బ్రాహ్మడిపుణ్యం అంతా మూడి పరంపదం వీంచేశాడు. ఆ పిల్లదాని తరపున భూముల కొరకు దావాతెచ్చారు. వీరు తమవంటి గవర్నమెంట్ ఆఫీసర్లకి తరుచుగా పని గలుగ చేసి ప్లీడర్లని పోషిస్తూవుంటారు. వీరి యోగ్యత లేమి, వీరి దయాంతఃకరణ లేమి, వీరి సరసత లేమి, మరి యెన్నడముకు శేషుడికైనా అలవికాదు. వారి తరపున కేసు దాఖలు చెయ్యడం కోసమే భీమారావు పంతులుగారు కోర్టుకు దయచేశారు (అని విరసముగానవ్వి కూరుచొనును).

కలెక్టర్ : బలే శాబాష్ (గుమాస్తాతో) ఏదీ భీమారావు పంతులుగార్ని ప్రియాదు అర్జీ దాఖలు చేయమను. (గుమాస్తా పుచ్చుకొని దాఖలు చేయును)

కలెక్టర్ : (కాగితమందుకొని) యేమిటయ్యా కేసు స్వభావం?

భీమా : చిత్తం, యీయన వెధవకొమార్తెని, యీయన కొమారుడికి చదువుచెప్పే గిరీశం అనే ఆయన అలంకారాలూ, ఆస్తీతోకూడా లేవతీసుకు వెళిపోయినాడు.

అగ్నిహో : దస్తావేజులూ, కోర్టుకాయితాలూ కూడానండీ.

కలెక్టర్ : యేమిటి? ఆ,హా,హా,హా,హా (అని నవ్వుచు బూట్సు నేలపైతట్టును) బలేశాభాష్ (అర్జీచూసుకొని) యిన్నాళ్లేమి చేస్తున్నారు?

భీమా : తహస్సీల్దార్‌గారి దగ్గర నేరం జరిగిన మూడోరోజునే మున్సబుకోర్టు వకీలు వెంకట్రావు పంతులుగారు, చార్జిదాఖలుచేస్తే ఆ తహస్సీల్దారుగారు కేస్ స్వభావం యేమిటని అడిగినారు. ఎబ్‌డక్‌షన్ అని వెంకట్రావుపంతులుగారు చెప్పేసరికి యింగ్లీషు రాకపోవడం చాత, తహస్సీల్దారు గారు ఆ మాట యెప్పుడూ విన్లేదని చెప్పారు. తరవాత కేస్ స్వభావం తెలుగున చెప్తే యీలాటి నేరం మా జూరిస్‌డిక్‌షన్‌లో జరగదు. తోవలో రోడ్డుమీద యే తాలూకా సరిహద్దులో యెత్తుకు పోయినాడో అని అర్జీ దాఖలు చేసుకున్నారు కారు. లుబ్ధావధాన్లుగారి కూనీకేసు కామాప్ చేసిన తహస్సీల్దారుగారే యీయనండి.

నాయడు: ఇంగ్లీష్ రాకపోతేనేమండి. తహస్సీల్దారుగారు యెంత ప్రాజ్ఞులు. పూర్వపు యూరోపియన్ అధికార్లని యెంతమందిని మెప్పించారు. ఆయన లుబ్ధావధాన్లుగారి కేసు కామాప్ చేశారని భీమారావుపంతులుగారు అంటున్నారు. యింకా విచారణవుతున్న కేసులో అలా అన్నందుకు యీనపైన తహస్సీల్దారుగారు పరువునష్టం చార్జీ తేవడమునకు వీలువున్నది.

గురుజాడలు

200

కన్యాశుల్కము - తొలికూర్పు