పుట:Gurujadalu.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బైరాగి : నాలుగు రోజుల క్రిందట విశ్వేశ్వరుడు కోవిల్లో ఒక బంగారపు రేకు పడ్డాది. దానిమీద అక్షరాలున్నాయి. బ్రాహ్మల కెవ్వరికీ తెలిసినాయికావు. అప్పుడు మా దగ్గిరకు తీసుకువచ్చేటప్పటికి మేము చదివాము-మరియెవరితో చెప్పకండి. అందులో ఆరు నెలలకి ఇంగిలీషు బావుటా పోతుందనివుందీ.

2 వ శూద్రుడు : ఏమాచ్చెర్రెం! ఏమాచ్చెర్రెం! గురువుగారు భోజనం యేటారగిస్తారు?

బైరాగి : పాలు, పంచదార, అరటిపళ్లున్నూ నెలకు పదిహేన్‌రోజులు ఆలాగు ఫలారం చేస్తాం, పదిహేన్‌రోజులు వాయుభక్షణం చేస్తాము. యోవూరు భోగట్టాలేమిటి?

1 వ శూద్రుడు : ఏమున్నాయండి. రామచంద్రపురం అగ్ఘురారం కాపరస్తుడు లుబ్ధావధాన్లని ముసలిబ్రాహ్మడు పెళ్లాన్ని కూతురుచేత చంపించేశాడు. కూనీ కేసు వొచ్చింది. రేపు . సాయింత్రం అతన్ని, హెడ్డుకనిష్టీబుని, సాక్షులనీ, తాసీల్దారుని సిక్ష చెబుతారు.

బైరాగి : (తెల్లపోయి) యీ వూరు పాపంతో నిండినట్టు కనబడుతుంది. యీ వూళ్లో మేమొక నిముషమయినా వుండము.

2వ శూ: గురోజీ మీ రెళ్లిపోతే మాగతేమిటి? కూనీ చేసినోళ్లు యీ వూరోళ్లుకారు.

3వశూ: ఆ వూరు దుకాణాదారుగారిదిగో వస్తున్నారు. ఆయన మంచి గ్యాని.

బైరాగి : (క్రేగంట నా దిక్కుజూచి) యీ వూళ్లో తాగడం లావుగావున్నట్టు కనబడుతుంది. మేము తాగుబోతులతో మాట్లాడము. ఆ దుకాణాదారు వచ్చేలోగా ఈ సందులోకి మళ్లిపోదామురండి.

(ఇంతటిలో దుకాణదారు పరుగెత్తికొని వచ్చును)

దుకా : (బైరాగీమొలలో చేయివేసి పట్టుకొని) నాకు బాకీవున్న రూపాయలిక్కడ కక్కితేనేకాని వొదలను.

బైరాగి : యేమిటీవాళకం! వీడు తప్పతాగి పేలుతున్నాడు. నేను మొదటే అన్నాను కానూ, తాగుబోతులతో సహవాసం కూడదని.

3వ శూ: భాయి! మీకేమి మతిపోయిందా యేమిటి? గురువుగారితో అలాగ మాటలాడుతున్నారు.

దుకా : గురువూలేదు, గుర్రాలేదూరుకోశ్. యీడెక్కడ గురువు, నా దుకాణంమీద సారా అంతా చెడతాగి డబ్బు యివ్వకుండా యగేశాడు.

2న శూ: నీకు మతిపోయింది. ఆయనేటి నీ దుకాణంమీద సారాతాగడం యేటి? మొన్న బయల్దేరి కాశీనుంచి యిప్పుడే ఒచ్చారు.

గురుజాడలు

197

కన్యాశుల్కము - తొలికూర్పు