పుట:Gurujadalu.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సౌజన్య : అయితే ఆ పిల్ల ఆస్తికి మీమీద దావా తేవలసివుంటుంది.

అగ్నిహో : దావాలకి భయపడేవాణ్ణి కానండోయ్.

సౌజన్యా: అది నాకు తెలుసును, మీరు అగ్రహారపు చెయ్యి, ఆఖరుమాట ఒక మాట చెబుతాను, ఆలోచించండి. మీరు గిరీశంమీద కేసుతేవడం మానుకుని ఆ పిల్ల తాలూకు ఆస్తి యిచ్చివేస్తే, మీమీద లుబ్ధావధాన్లుగారు తెచ్చిన ఫిర్యాదు తీయించివేస్తాను.

అగ్నిహో :కేసు మానుకుంటానూ? లుబ్ధావధాన్లుకు చేసినట్టే యెప్పుడో వొహప్పుడు వాడిక్కూడా యెమికలు పచ్చడిచేస్తాను. లుబ్ధావధాన్లు నన్ను చేసేదేమిటి? సాక్ష్యం రావాలికాదూ.

సౌజన్య: ఇప్పుడు మీరే నాదగ్గిర వొప్పుకున్నారుగదా! నేనే పలుకుతాను సాక్ష్యం.

అగ్నిహో : అంతవారు కారనా, యేడిసినట్టేవుంది ముండాసంత, యేడిసినట్టేవుంది. యిందుకేనా యింత ప్రత్యుథ్థానంచేసి నన్ను తీసుకువచ్చారు. యేమిటో కేసులో సలహా చెబుతారనుకున్నాను.

(అని లేచి వెళ్ళిపోవును)

***

మూడవస్థలము - విశాఖపట్టణములోని వీధి

(బైరాగీ, వెనుక పదిమంది శూద్రులు ప్రవేశీంచుచున్నారు)

1 వ శూద్రుడు : యక్కడనుంచి విజయం చేస్తున్నారు?

బైరాగి : నేను కాశీనుంచి వస్తున్నాను.

1 వ. శూద్రుడు : యన్నాళ్లాయి బయలుదేరినారు?

బైరాగి : రెండురోజులయినది.

2 వ. శూద్రుడు : యలాగొచ్చారు యింతయేగిరం.

బైరాగి : పవనం బంధించి వాయువేగంమీద వచ్చాము.

3వ శూద్రుడు : యోగులకి యాలాటి శిద్దులయినా వుంటాయి. యీయనే కాబోలురా మొన్న శివరాత్రికి, సింహాచలంలోను, వుపాకలోనూ కూడా ఒక్క మాటే కనపడ్డాడనీ అనుకున్నారూ?

బైరాగి : యీ వూరిలో సదావృత్తి మఠం వున్నదా?

3వ శూద్రుడు: లేదుగురూ మేమంతా వుండగా మీకు మఠం యెందుకూ? కాశీలో భోగట్టా యేమిటిగురూ!

గురుజాడలు

196

కన్యాశుల్కము - తొలికూర్పు