పుట:Gurujadalu.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామప్ప: మరి యేకొంపలూ తీరక్కపోతే కేసులు గెలియడం ఎలాగు? అది అందరు ముండల్లాంటి దనుకున్నారా యేమిటి? సంసారి వంటిది. ఐనా మీకు రావడం ఇష్టం లేకపోతే నాచేతికివ్వండి. నేనే తాకట్టుపెట్టి తీసుకొస్తాను.

అగ్నిహోః అలాక్కాదు నేను కూడా వస్తాను.

రామప్ప: యేదీ కడియం ఇలాగివ్వండి.

అగ్నిహో : యిది మాతాతగార్నాటిది. యిది యివ్వడమంటే నాకేమీ యిష్టంలేకుండా వుంది. డబ్బూరికే ఖర్చుపెట్టించేస్తున్నారు. మీరు కుదిర్చిన వకీలు తగిన వాడుకాడు, యింగ్లీషూ రాదేమీ లేదూ.

రామప్ప. ఆయన్లాంటి చెయ్యి యీ జిల్లాలో లేదు. ఆయన్ని చూస్తే డిప్టీకలక్టరు గారికి ప్రాణం. ఇంతకీ మీరేదో పట్టుదల మనుషులనుకున్నా గాని మొదటున్న వుత్సాహం యిప్పుడు లేదు. మీకు డబ్బు ఖర్చుపెట్టడం యిష్టంలేకపోతే మానేపాయెను. యావత్తైలం తావద్వ్యాఖ్యానం అన్నాడు, మరి నాకు శెలవిప్పించెయ్యండి.

అగ్నిహో : (ఆలోచించి) అయితే తాకట్టు పెట్టండి. (అని నిమ్మళముగా కడియము తీసియిచ్చును)

రామప్ప: (తన చేతనెక్కించుచు) యీ కేసుల్లో యిలాగు శ్రమ పడుతున్నాను కదా? నాకొక దమ్మిడీ అయినా యిచ్చారుకారుగదా?

అగ్నిహో : అయితే నా కడియం వుడాయిస్తావా యేమిషి ?

రామప్ప: నేను మీకు యెలాంటి వకీల్ని కుదీర్చాను. ఆయన మీ విషయమై యంత శ్రమపడుతున్నాడు. ఇదుగో ఆయన వస్తున్నాడు.

(నాయడు ప్రవేశించును)

రామప్ప: (తనలో) యేమిటి చెప్మా వీడు మధురవాణి బసపెరటి దొడ్డివేపునుంచి వస్తున్నాడు? వీడుకూడా మధురవాణిని మరిగాడా యేమిటి? వీణ్ణి ఈ కేసులో నుంచి తప్పించెయ్యాలి.

నాయడు: యేమండీ రామప్పంతులన్నా, మిగతా ఫీజిప్పించారుకారుగద?

అగ్నిహో : మీరు రాసిన డిఫెన్సు బాగుంది కాదని భుక్తగారన్నారట.

నాయడు: ఎవడా అన్నవాడు గుడ్లు పీకించేస్తాను. రామప్పంతులన్నగారూ చూశారండీ - డిఫెన్సు యెంత జాగ్రత్తగా తయారీచేశానో. నా దగ్గిర హైకోర్టుకూడా ప్లయింట్లు రాసుకు వెళ్లిపోతారు, యీ కుళ్లు కేసనగా యేపాటి? నే చెప్పినట్టల్లా పార్టీ నడిస్తే నే

గురుజాడలు

190

కన్యాశుల్కము - తొలికూర్పు