పుట:Gurujadalu.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అగ్నిహో : యిదేదో అయితేనేకాని యింటి మొఖంచూచేదిలేదు. ఓ సరుకేదైనా మా అమ్మిది యీ వూళ్లో అమ్మేస్తాను.

రానుప్ప: అయితే పట్టుకురండి పోలిశెట్టికి అమ్మేదాము. మీరు లుబ్ధావధాన్లని కొట్టేటప్పుడు పోలిశెట్టి దగ్గిర వున్నాడని చెప్పారు. లుబ్ధావధాన్లు మీమీద కేసుతేవడం స్వతస్సిద్ధం. పోలిశెట్టి మీమీద సాక్ష్యం పలక్కుండా వాడికేమైనా యిచ్చి కట్టుకుందాము.

అగ్నిహో ఆ సలహా బాగుంది. నాకూ అదే భయంవేస్తూవుంది.

రామప్ప: చూశారా ప్రతివాడికీ సలహా చెప్పడానికి చాతవుతుందండీ! అందులో యీ యింగ్లీషు చదువుకున్న అయ్యవార్లని సలహా అడిగితే కేసులు తేవద్దంటారు. వాళ్ల సొమ్మేం పోయింది. దొంగసాక్షాలు కూడదంటారు. యేవీ లేకపోతే కేసులు గెలవడం ఎలాగు?

అగ్నిహో :మా అయ్యవారుమట్టుకు మంచి బుద్దిమంతుడూ, తెలివైనవాడండీ. కేసుల విషయమై అతనికి తెలియందేదీలేదు. అంత బుద్ది మంతుణ్ణి యెక్కడా చూడలేదు, మీరు అతణిస్తే చూస్తే మీరూ అలాగే అంటారు.

రామప్ప: మీకు మరొకరు సలహా చెప్పవలసిన జరుగురుండదు. నా మాటవిని అయ్యవారిని తోడిచ్చి పిల్లల్ని యింటికి పంపించెయ్యండి, లుబ్ధావధాన్లు మీమీద చార్జీ తెచ్చేలోగా మనం ముక్కతగిలించేస్తేనేగానీ బాధిస్తుంది, మరి వేగిరం ఏదో సరుకు పట్టుకురండి.

అగ్నిహో :యేదీ అమ్మి నిలా పిలువ్ (అమ్మేది, అమ్మేదియని పదిమందియు పిలుతురు)

వెంకమ్మ : అమ్మేదీ చెప్మా బద్దకించి బండిలో పడుకుందేమో పిల్చుకొస్తాను. (అమ్మిబండి యేది యనుచు నాలుగడుగులు నడుచును)

ఒకరు : అమ్మిబండీ యెక్కడా కనబడదు. బండీ, వెనకుండిపోయిందేమో?

వెంకమ్మ : అడుగో అబ్బున్నాడే, వీడెలావచ్చాడు? అబ్బీ నువ్వక్కయ్య బండిలో కూర్చోలేదూ?

వెంకటే: లేదు. నేను యేనుగెక్కాను.

అగ్నిహో :దొంగగాడిద కొడకా అయ్యవారేడ్రా.

వెంకటే: యెక్కడా కనబడడు.

అగ్నిహో :గుర్రం యేదీ, గుర్రపాడేడీ.

వెంకటే: రాత్రివేళ గుర్రం దిగిపోయి బండీయేక్కాడని గుర్రపువాడు చెప్పాడు.

వెంకమ్మ : అయ్యో దాన్ని లేవదీసుకుపోలేదు గద?

దగ్గిరనున్న వారు : ఆఁ! ఆఁ!

గురుజాడలు

188

కన్యాశుల్కము - తొలికూర్పు