పుట:Gurujadalu.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రామప్ప: (తనలో) గట్టి వుపద్రం వచ్చింది. (పైకి) సుందరి! యెందుకు నిష్కారణంగా విచారిస్తావు యీ నెలలో రొండు కంటెలు సంపాదించి యివ్వకపోతే నా మీసం గొరిగించెయ్యి

మధుర: నాకేమి అక్కరలేదు నాకంటె నాకు కావాలి.

రామప్ప: (దగ్గిరకు వెళ్లి) గడ్డం పట్టుకు బ్రతిమాలుకుంటాను. (అని గడ్డము పట్టుకొనబోవును, మధురవాణి తోసివేయును)

రామప్ప: కాళ్లు పట్టుకుంటాను నన్ను రక్షించి యేలాగైనా ఈ మాటు కాపాడు.

మధుర: ఆ కంటె యెవర్తికిచ్చావో దాని కాళేపట్టుకో. (అని తన్నివేయును)

ఎనిమిదవ స్థలము - తోట

(రామప్పంతులు, అగ్నిహోత్రావధానులు, వెంకమ్మ, మొదలగువారు)

అగ్నిహో : గాడిదకొడుకుని మా చెడ్డదెబ్బలు కొట్టేశాను. యేనుగులూ గుఱ్ఱాలూ తెచ్చాను - వీడి శ్రార్ధము మీదికి త్రోవ ఖర్చులైనా వాడు వొక దమ్మిడి ఇవ్వడష,

వెంకమ్మ : మన ప్రాలుద్ధం గాని యెందుకీ సంబంధం వద్దంటే విన్నారూ. నేను మొదటే అనుకున్నాను - వచ్చేటప్పుడు పిల్లి యెదురుగుండా వచ్చింది.

అగ్నిహో : మాదర్చోద్ వూరుకో? ఆడముండలకేమి తెలుసును. అన్నగారూ - క్రిమినల్ మీద వెళ్లడానికి అవకాశంగా వుంటుందా? మా దగ్గిర గిరీశంగారని అయ్యవారు ఒకరున్నారు- ఆయనకీ లాభోగట్టా మా బాగా తెలుసును. ఆయనను కూడా సలహా చేద్దాం.

రామప్ప: (తనలో) ఇదేమిటి పులిమీద పుట్రొచ్చింది వీడినిపట్టి గ్రంథంచేయించి డబ్బు పిండాలనుకుంటూవుంటే నా చేతిలో నుంచి వ్యవహారము తప్పిపోయేటట్టు కనపడుతూ వున్నది. (పైకి) చిన్నప్పటినుంచీ, లాలో పుట్టి పెరిగాను. నా కంటె యెక్కువ తెలిసిన వాడొకడున్నాడా? అయినా యిందులో సలహా కేమున్నది. మీరు మాత్రం యెరగని లా యేముంది. మొట్టమొదట క్రిమినల్కి తెచ్చేది, తరవాత సివిలు, నా సలహాప్రకారం వెళితే యీ కేసులో నాలుగువేల రూపాయిలు డామేజి యిప్పిస్తాను. మొట్టమొదట ఖర్చులకి మట్టుకు కొన్ని రూపాయిలు పట్టుకోవాలి.

అగ్నిహో : నా దగ్గిర లెఖ్క దమ్మిడీ లేదండీ, యీ గాడిదెకొడుకు రూపాయిలిస్తాడనే నమ్మకంచాత నేనేమీ తేలేదు.

రామప్ప: యింటికి వెళ్లి లెఖ్ఖపట్టుకు వచ్చేటప్పటికి వ్యవధి అయిపోతుంది. శుభస్యశీఘ్రం అన్నాడు. మీ ఆలోచనేమిటి?

గురుజాడలు

187

కన్యాశుల్కము - తొలికూర్పు