పుట:Gurujadalu.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గిరీశ : ఆహా! ఆ తల్లిదండ్రులు నీకు శత్రువులైనారు గదా! ముసలివాడికి కట్టిపెట్టడం కంటె శవానికి కట్టిపెట్టడం మేలు. ఆహా! స్త్రీలకు వెధవరికం యెంత దురవస్త, మీవంటి శోభ గల ముఖమునకు బొట్టూ కాటుక యుంటే యేమి సొంపుగా నుండును. ఆ తుమ్మెద బారుల నపహసించు జుత్తుతీసి వేయుదురు గదా? వంటిపూట తిండిబెట్టి ఆ దబ్బపండువంటి శరీరము కృశింపచేతురు. ఇంటిచాకిరంతా నీవే చేయవలెను గదా? మనవాళ్ల ఆచారము లెంత దుర్మార్గముగానూ, శాస్త్ర విరుద్ధముగానూ వున్నవి.

బుచ్చమ్మ: మన శాస్త్రాల్లో అలా చెయమనే వుందటే?

గిరీశ : రామాయణము నెత్తిని పెట్టుక ప్రమాణం చేస్తాను. చిన్న పిల్లని ముసలి వాడికివ్వగూడదని శాస్త్రమున్నది గానీ, విధవలను పెళ్లాడగూడదని లేదు. మీ తమ్ముడికి పాఠం చెప్పేటప్పుడల్లా శాస్త్రాలూ, సబబులూ చదివి వినిపించుతూనే వున్నాను కానూ. నేను సలహాయిచ్చినట్టు వెళ్లిపోడమే వీళ్లకు శాస్తి. నీయందు నాకు అపరిమితమైన అనురాగము వున్నది. నీవు ఆలాగు రాకపోయినా యీ సంగతి మీవాళ్లతో చెప్పినా తప్పకుండా ప్రాణత్యాగంచేస్తాను. నీ కోసమే ఇన్నాళ్లు మీ వాళ్ల యింట్లో అరవచాకిరీ చేస్తూ ఉన్నాను.

బుచ్చమ్మ: మీరు చెప్పిన మాటలు బాగానే వున్నవి గాని జాతిలోనుంచి వెలివేస్తారు గదా అని భయము మట్టుకు వదలకుండా వున్నది.

గిరీశ : నీ యడల ఇంత అక్రమముగా నడిచినవాళ్ల లోంచి విడిచిపోతే నీకు వచ్చిన నష్టం యేమి? యింత సొగసూ, యిన్ని సద్గుణములూ బూడిదేలో పోసిన పన్నీరు అయి పోయెను గదా అని విచారిస్తూన్నాను. గౌర్నమెంటువారు మళ్లీ పెండ్లాడిన వెధవల్ని కులములో కలుపుకొమ్మని ఆక్టుకూడా కొద్ది రోజులలోనే ప్యాసుచేయడానికి సిద్ధంగా వున్నారు.

బుచ్చమ్మ: లేచిపోయి మావాళ్లందరికీ-విచారం కలగచేయడంకంటె నేను బాధపడుతూ అయినా యిక్కడ వుంటేనే మంచిది కాదూ?

గిరీశ : నీవు యెక్కడ వున్నా యేమిచేసినా నీకు లోపంలేదు. వజ్రమెక్కడున్నా వజ్రమే, కానీ నీవు రాకుంటే నా బ్రతుకంతా వృధా అయిపోతుంది. నా ఇష్టము నెరవేరకపోయిన యడల జీవించడమందు యెంతమాత్రమూ అభిలాషలేదు. నీవు మీవాళ్లను విడవవలసి వస్తుందన్నావు? నీకింత అపకారము చేసి నిన్నింత బాధపెడుతూ వున్నవాళ్లను, విడిచేమి వీడవకేమి. నెత్తి మీద పువ్వులాగ ధరిస్తాననిన్నీ, నీవు లేక జీవించలేననిన్నీ మనవి చేసుకుంటూ వున్న నన్ను పొందక పోవడం ధర్మమా (అని మోకాళ్లపడి చేయిపట్టుకుంటాడు).

గురుజాడలు

182

కన్యాశుల్కము - తొలికూర్పు