పుట:Gurujadalu.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవస్థలము - అగ్నిహోత్రావధానులయిల్లు

(అగ్నిహోత్రావధానులు, వెంకమ్మ ప్రవేశించుచున్నారు.)

అగ్నిహో : రెండు జాముల రాత్రికి ప్రయాణం.

వెంకమ్మ : యెన్ని బళ్లేమిటి?

అగ్నిహో :యిరవయ్యెదుబళ్లు.

వెంకమ్మ : అన్ని బళ్లేందుకేమిటి?

అగ్నిహో :నులకవారు, నెమలివారు, నప్రవారూ అంతా వస్తారు. కరణంగారి కుటుంబముకూడా వస్తామని చెప్పారు దివాంజీ సాహేబుగారు ఒక యేనుగ, నాలుగు గుఱ్ఱాలూ ఇచ్చారు.

వెంకమ్మ : అల్లుడినడుం ఇదివరకు విరగకుండా వుంటే దీనితో విరిగిపోతుంది. యెందు కేమిటి యీ వెధవ పటాటోపమంతాను? తోవలో మనమింత మందికి తిండి పెట్టాలి కదా? వూళ్లో అయిన వాడినీ కానివాడినీ వెంట పెట్టుకు వెళ్లితే అల్లుడు పకీరౌతాడు - అమ్మిముష్టెత్తుకోవాలి.

అగ్నిహో : ఉత్సాహభంగమ్మాట్లాడకు, నాకు కోపము మాత్రము తెప్పించకు. లుబ్ధావధాన్లు పెళ్లియెంతో వైభవంగా చేస్తాడు.

వెంకమ్మ : చాలును ప్రయోజకత్వం. తోచినప్పుడల్లా ఆడవాళ్లను పశువులలాగ బాదడమే కదా ఇప్పటికిన్నీ, మా మంచి సంబంధం చేశారు లెండి మావాళ్లు కోపంవచ్చి రావడం మానేశారు.

అగ్నిహో : మీవాళ్లు రాకపోతే పీడాచీడా కూడా పోయింది. మీవాళ్లు ఓర్వలేని గాడిదలు.

వెంకమ్మ : అయ్యవారు బయలుదేరి వెళ్లిపోతామంటున్నారు. ఆయన కేదో పరీక్ష వుందట.

అగ్నిహో :ఆయన వెళ్లిపోతె పెళ్లిసప్లై యెంతమాత్రమూ జరగదు. యేలాగైనా వుండమని బతిమాలు కుంటాను. ఆయనలాంటి అల్లుడుంటేనా, లోకమంతా సాధింతును. (నిమ్మళముగా) చిన్నమ్మిని ఇతనికిస్తే తీరిపోవును. అయితే డబ్బుంటేనేగానీ వ్యవహారం జరగదు.

(అని నిష్క్రమించుచున్నారు)

(గిరీశం, బుచ్చమ్మ, ప్రవేశించుచున్నారు.)

గిరీశ : మీ పెనిమిటి యెన్నేళ్లె పోయినాడు.

బుచ్చమ్మ: పెళ్లి సదస్యంనాడే.

గురుజాడలు

181

కన్యాశుల్కము - తొలికూర్పు