కథలు తోలుబొమ్మలాటలు, బయలు నాటకములు మొదలగు వానిని ఆడించుచుండిరి. పేదలందరు టిక్కెట్టు లేకనే చూచివిని ఆనందము జ్ఞానమును సంపాదించుచుండిరి. ఇప్పుడు నాటకములకు సినిమాలకు టిక్కెట్లున్నవి. పేదలు పోవుటకు వీలులేదు. కావున వారికి జ్ఞాన సాధనములు కొఱవడినవి. దేశము మరింత అజ్ఞానములో బడిపోవుచున్నది. జనులనీతి క్రమముగా తగ్గి భక్తి విశ్వాసములు అదృశ్యము లైనవి.
కావున ధనవంతులమీద బాధ్యత హెచ్చుగా గలదు. వారు తమ సొమ్మును స్వార్థమునకు వినియోగించి తామే జ్ఞానవంతులు విద్యావంతులగుటకు ప్రయత్నించినచో లాభము లేదు. వేయిమంది అశుచిపరులలో ఒక్కడు ఆచారవంతు డుండిన వాని ముఖ్యసాధన ఆచారము నిలువదు. కావున సాధ్యమైనంత మందికి విద్యాదానము చేయుట అందరికిని విధియై యున్నది. వీనికి ముఖ్య సాధనములు గ్రంథాలయములే. రష్యాలో బీదలందరికిని ఉచితసినిమా నాటకశాల లేర్పగుపడినవి. వానిమూలమున వారు జ్ఞానమును సంపాదించుచున్నారు.
తెరుగున నెన్నియో గ్రంథములు లేవు. మీరు చుట్టకు సిగరెట్టునకు వ్యయము చేయు ధనములో 6 వ పాలు వ్యయము చేసినచో దివ్యమైన గ్రంథాలయ మేర్పడగలదు. జనుల నాకర్షించు నిమిత్తము గ్రంథాలయములలో పురాణములు, హరికథలు చెప్పించవలెను. రేడియో ఒక్కటి నుంచిన ప్రపంచపు వార్తలన్నియు తెలియుచుండును. పత్రికలు చదివి వినిపించుట కేర్పాటుచేయవలెను. వ్యాయామశాల లేర్పాటుచేసి యువకుల నాకర్షించి వారికి జ్ఞానాభివృద్ధితో పాటు దేహారోగ్యాభివృద్ధి కూడ కల్గింపవలెను.
మన దేశములో పలువురు చదువ నేర్చినారు గాని రచనాశక్తి చాలమందికి తక్కువ. పండితులు గూడ నాలుగు పంక్తులు నిర్దుష్టముగా వ్రాయజాలరు. వ్రాయగలవారు సోమరులై రచనాశక్తిని వృద్ధిచేసికోరు. కావున పోటీ పరీక్షలు వ్యాసరచనా పరీక్షలు పెట్టి గ్రంథాలయములు చదువరులలో రచనా శక్తి వృద్ధి చేయవలెను.
ఇట్టి కార్యము లన్నియు చేసి, గ్రామము నందు గ్రంథాలయములు జ్ఞానజ్యోతివలె ప్రకాశించి జనులకు అనేక విధముల ఉపయోగించ వలెను. మీ గ్రామమునందు జను లెల్లరు సాయపడి ఈ జనార్ధన గ్రంథాలయమును సర్వవిధముల వృద్ధి పొందింతురుగాక.