మార్థమనియు చెప్పి తన ఇతరదేశపర్యటనలో ఆయాదేశముల యందలి దర్మగ్రంథాలయోద్యమ విజృంభణను గూర్చి జాగ్రతతో పరిశీలించి, తన్మూలమున మాతృదేశమునకు హితోధికలాభమును జేకూర్చుటకు ప్రయత్నించెద నని విన్నవించిరి. వీరు తిరిగి వచ్చిన పిమ్మట ఆయాదేశములందు వారు సంపాదించిన అనుభవముల వలన భారత ధర్మగ్రంథాలయోద్యమునకు గొప్ప చేయూత దొరకగలదు.
గ్రామ గ్రంథాలయములు.
గ్రామములే దేశమునకు ఆయువుపట్టులు. పట్టనములయందలి జనులు ఎంత విద్యాధికులైనను, ఎంత నాగరికులైననూ దేశ మభివృద్ధి గాంచనేరదు. పట్టణవాసులతోబాటుగ పల్లెలయందుండు జనులుకూడ అభివృద్ధిపథము ననుకరింప గలిగిననేగాని జాతియొక్క వికాసము సంపూర్ణము గానేరదు. ఇది నిర్వివాదాంశము. కాని పల్లెలయందుండు జనులు విజ్ఞానులగుటకు గల మార్గమేమి? అక్కడక్కడ కొన్ని పల్లెలయందు ప్రారంభవిద్యను ఒసగునట్టి పాఠశాలలు గలవు. వానియందు కొంతమంది బాలురు విద్య నభ్యసించెదరు. కాని ఫలితమేమి? ఆకొద్దిమంది అభ్యసించునట్టి స్వల్పవిద్యయైన జాతీయ వికాసమునకేమైన దోడ్పడుచున్నదా?
అక్కడక్కడ గ్రామములందున్న పాఠశాలలయందు కొందరు ప్రారంభవిద్యను జదివెదరు. పిమ్మట ఏమిచేయుదురు? ఆస్వల్పవిద్యను ' కచేరీలకెక్కుట ' కు గావలసిన తరిబీతునందు వినియోగించెదరేకాని, పిమ్మట జ్ఞానాభివృద్ధిని జేసికొనుట కెంతమాత్రమును వినియోగింపరు. అందుచేత పిల్లలకేగాని పెద్దలకుగూడ జ్ఞానాభివృద్ధిని జేసికొనుటకుగాను గ్రంథాలయములు అత్యవసరములు. పాఠశాలలందు చదివిన విద్యయొక్క శేషమును వారిచట ప్రారంభించెదరు. ఇంతేగాక, మన పల్లెలయందు చదువుకొనజాలని జనులుగూడ విశేషముగ గలరు.