Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

ఆహ్వాన సంఘాధ్యక్షులగు బారు శ్రీరామ నరసింహా రావుగారి యుపన్యాసము.

మహనీయులారా! ఆంధ్రభాషాభిమానులారా! ఆంధ్రదేశాభివృద్ధి చికీర్షులారా!

ఆంధ్రదేశ గ్రంధ భాండాగార ద్వితీయమహాసభా ప్రతినిధి ప్రముఖ సన్మాన సంఘ పక్షమున నాహృదయపూర్వక స్వాగతము నిచ్చుటకై నాకవకాశము కలిగింపఁబడినందుకు మిక్కిలి సంతసించుచున్నాను. ఈదినములలో తీవ్రనిదాఘతాపమున బాధలకోర్చి కడు దూరమునుండి మిక్కిలి ప్రయాసముతోఁ బ్రయాణము చేసి మా యాహ్వానమును గౌరవించి ఇచటికి దయచేసినందులకు ఈ భాండాగారోద్యమమునందు మీ కెల్లరకుగల సానుభూతీయు, నుత్సాహమును మాత్రమే కారణంబులు గాని మరియొకటి కాదు. ఇంత శ్రమపడి మీరందఱిక్కడకు విచ్చేసినందులకు మీకుఁ దగిన సత్కారములొనర్చి మీ భోజనమజ్జనపానాదులకుందగు సౌకర్యములను ఉచితరీతిని గలుగఁజేయునంతటి శక్తి మాకు లేనందులకు మిక్కిలి చింతించుచున్నారము. అయినను ఈ భారము మాపై వైచుకొనుట దానిని జయప్రదముగా కొనసాగింపఁగల శక్తి మాకుఁ గలదనెడి ధైర్యముండికాదు. మీ యందఱివలె మాకును ఈ భాండాగారోద్యమమందు గల యుత్సాహమే కారణము. శ్రీమదఖండి గౌతమీపవిత్రసలిల స్నానపానములును, పౌరాణిక, చరిత్రాత్మక గాధలతో నిండియుండి సుప్రసిద్ధ ప్రాచీనాధునిక కవులచే నలంకరింపఁబడినటువంటి యు, దక్షిణ కాశీ నా వాసిగాంచిన మారాణ్మహేంద్రవర పుణ్యక్షేత్ర సందర్శనమును మాత్రమే మీకుఁ గలుగఁజేయఁగలిగిన లాభములని యెంచుకొనుచున్నాము. మేము మీ యెడల జరుపవలసిన యుదారకృత్యముల విషయమై మాకుఁగల యుద్దేశముల మాత్రమే మీరు భావించి లోపములను మన్నింపఁ గోరుచున్నాము.

ఈ యాంధ్ర దేశ గ్రంథ భాండాగార, మహాసభ నిరుటి సంవత్సరము విజయవాడలో పుట్టిన పసికూనయని మీయెల్లరకు విశదమే, దీనిని కడు శ్రద్ధతో, నాదరముతోఁ బోషించి పెంచు భారము మనదైయున్నది.

ఆంధ్రసాహిత్యపరిషత్తు భాషాభిమానులైనయనేక రాజులయొక్కయు, రాజకీయోద్యోగులు మొదలయిన వారి యొక్కయు నాదరమువలన వర్థిల్లుచున్న సంగతి మీకుఁ దెలిసియేయుండును. ఆపరిషత్తు యొక్కయు నీ గ్రంధభాండాగార సభ యొక్క యు నుద్దేశము లించుమించుగా సమానములై, యన్యోన్య సంబంధము గలవైయున్నందున నీ రెండు సభలును ప్రతిసంవత్సర మొకచోట నే యేక కాలమున జరుపుట యనుకూలమనియు, నవి పరస్పర సహకారములుగా నుండుననియు నాయభిప్రాయము. ఇపుడు మీరందరీ విషయమై కూడ నాలోచించి ముందు సంవత్సరమునుంచి యీమహాసభ యెక్కడ జరుగవలసియుండిన లాభకరమో నిశ్చయింపవలసియున్నది.

ఈ యుద్యమము యొక్క ముఖ్యోద్దేశము జనసామాన్యమునకు జ్ఞానోపదేశము చేయుటయే. ఈ యుద్యమము మన హిందూ దేశమునకు క్రొత్తకాదు. ఐహికాముష్మికములకుఁ దగిన జ్ఞానము మన పురాణములయందు నిబిడీకృతమై యున్నది. అట్టి పురాణములను వీధులలోను, తదితర బహిరంగ ప్రదేశములలోను పఠనము చేయుట వలన, వీధినాటకములు మొదలగు వానిని ప్రదర్శించుటవలనను జనసామాన్యమునకు జ్ఞానోపదేశము కలుగఁజేయఁబడుచుండేడిది. కాని యిప్పటి కాలస్థితిని బట్టి అరీతుల జ్ఞానాభివృద్ధిని దీని కలుగఁజేయుట కందఱకవకాశము లేదు. ప్రాచీనకాలమున మన హిందూరాజ్యమున గూడ ననేక భాండాగారములను మనరాజులు నెలకొల్పి యుండిరన్న సంగతి చరిత్రల వలన తెలిసి కొనుచున్నారము.తరువాత తురుష్క రాజ్యములో నెట్టి దురవస్థకలిగి యెంతెంతటి భాండాగారము లెటులు నశించినవో తెలిసిన యంశమే. ఇప్పుడో, ప్రస్తుతాంగ్లేయ రాజ్యపాలనము నందలి ప్రశాంతకాలమున మన కట్టిక్కట్టులెల్ల తొలిగిపోయినవి. ఈ యుద్యమము ప్రబలి జనసామాన్యమునకు జ్ఞానదాయకమగుట కనుకూల సమయమై యున్నది. ఈ భాండాగారోద్యమమును సరియై