Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/59

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సారస్వత జీవనము.

ఉ.

భూషలు గావు మర్త్యులకు◆భూరిమయాంగద తారహారముల్
భూషిత కేశపాశ మృదు◆పుష్ప సుగంధజలాభిషేకముల్
భూషలు గావు పూరుషుని◆భూషితుఁజేయు పవిత్రవాణివా
గ్భూషణమే సుభూషణము◆భూషణముల్ నశియించు నన్నియు౯.

(లక్ష్మణకవి)

సారస్వత జీవన మననేమి?

సారస్వత జీవన మననేమో యాంగ్లేయభాషాపరిచితులు కానివారికి బోధపడక యెద్దియో యొక క్రొత్తవిశేపముగాఁ బొడకట్టవచ్చును. గ్రంధరూపమున నున్న వాఙ్మయమునకే సారస్వతమనునామము వర్తించుచున్నది. అట్టిసారస్వతనిర్మాణమునే జీవనాధారముగాఁ జేసికొని లోకయాత్ర గడపునట్టి వృత్తికే సారస్వత జీవనమని నామకరణముఁ జేయుచున్నాఁడను. దీనినే గ్రంధములు వ్రాసి తన్మూలమున ధనమాజి౯౦చుటయే వృత్తిగాఁ గలిగియుండుట యని తేటమాటలతోఁ జెప్పఁదగును. ఇట్టి సారస్వత జీవనము నాగరికులైన విదేశీయులలో నెక్కువగాఁ గాన్పించుచున్నను మనయాంధ్రులలో నరుదైయున్నది. ఈవిషయము మహత్తరమైన దగుటచేతను, యిదియొకవృత్తిగా మన దేశమున నిదివఱకుఁ బరిగణింపఁబడ కుండుటచేతను, ఆంధ్రసారస్వతమును గూర్చి మాత్రమే వ్రాయుదును.

ప్రాచీన కాలమున సారస్వతజీవనము.

“సారస్వత జీవనము పూర్వముండెనా? ఉన్నచో, నేరీతి నుండెను? ఇప్పుడే రీతినున్నది? దీనినవలంబించుటవలనఁ గలుగు లాభనష్టము లెట్టివి? దీని నభివృద్ధిపరచుటెట్లు?" అనునీ మొదలగు ప్రశ్నంబులకుఁ దగిన ప్రత్యుత్తరంబులు సంగ్రహముగానైనఁ జర్చించి చెప్పవలసియుండును. సారస్వతజీవన మొకరీతిగాఁ బూర్వకాలమున మన దేశముననుండెనుగాని స్వచ్ఛమైన రీతినుండక యది యొక ప్రత్యేక మొకశాఖవారిలోనే యత్యల్ప సంఖ్యాకులులచే నలంకరించుకొనఁబడి దేశకాల స్థితులనుబట్టి యెదుగుబొదుగు లేక సంస్కారరహిత మైయొప్పుచుండెను.

పూర్వకాలమున రాజ్యపరిపాలనము చేసిన మహారాజులు, మండలాధిపతులు, సేనానాయకులు, మంత్రులు, ధనికులు మొదలగువారు కొందఱు భాషాభిమానులును కీర్తికాములునై కవుల నాదరించి భూవసతులను, కొన్నివేళలనగ్రహారములను నొసంగియు, ధన కనక వస్తు వాహనాదులచే సంతరింపఁజేసియు బహువిధంబుల సత్కరించుచుండుట చేత ననేకులు వారలకు కృతుల నంకితములఁ గావించి కుటుంబ పోషణముఁ జేసికొనుచుఁ వచ్చిరి గాని యదియంతియుత్తమ మార్గము గాఁగనుపట్టకుండెను. అంతియగాక మహాసముద్రములో నొక జలబిందువువలె మహా సంఘములో వారిసంఖ్య యత్యల్పమై యుండెను. ఆయత్యల్పసంఖ్యగల వారి మార్గము కూడ నిఱుపేదలై, భక్తాగ్రగణ్యులయిన కవివరేణ్యులచే నీచమైనదిగాఁ గర్హింపఁబడుచునే వచ్చినదికాని యుత్తమ మార్గమని సూచింపఁబడలేదు.

బమ్మెర పోతన.

పూర్వజన్మ సహస్ర సంచిత తపఃఫలంబున శ్రీమన్నారాయణ కథాప్రపంచ రచనా కుతూహలుండును, సహజ పాండిత్యుండును, కవివరుండును, భక్తాగ్రేసరుండునగు బమ్మెర పోతన నిఱుపేదయయ్యును నరకృతి నిషేధించి, తనభాగవతమును శ్రీవారి కంకితము చేసినట్టుగనేతత్కృతిలోని

ఉ.

ఇమ్మనుజేశ్వరాధముల
       కిచ్చి పురంబులు వాహనంబులు
సొమ్ములుఁ గొన్ని పుచ్చికొని
       సొక్కి, శరీరమువాసి కాలుచే
సమ్మెట వేటులంబడక
       సమ్మతి శ్రీవారికిచ్చి చెప్పెనీ