Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మున నిరానంద మై యున్నపురవరమున, కెట్లు చనువాఁడ నానతి యిమ్మధీశ.

1067


తే.

మిహిరకులవర్య మును భవత్సహిత మైన, రధము గ్రమ్మఱ నిటు భవద్రహిత మగుచు
నుండ వీక్షించి వీటిలో నున్నవారు, పద్మదళలగ్నజలములభంగిఁ గారె.

1068


తే.

సూతపరిశేష మైన యీశూన్యరథము, నాజి హతవీర మైనసైన్యమును బోలెఁ
జూచి సాకేతనగరంబు శోకతాప, యుక్త మై కడుదైన్యంబు నొందుఁ గాదె.

1069


తే.

జనవరాత్మజ దూరదేశమున నున్న, వాఁడ వైనను నిను వీటివారు మ్రోల
నున్నవానిఁగ మది నెంచి యోగిరంబు, గుడువ నొల్లక యుందురు జడత నొంది.

1070


చ.

కడువడి నీవు ప్రో ల్వెడలి కాననసీమకు నేగుదెంచున
ప్పుడు నినుఁ బాయ లేక బలముఖ్యులు పౌరు లమాత్యకు ల్సఖు
ల్దడయక దుఃఖశోకమునఁ దద్దయు నాకులపాటు నొందుచు
న్జడత వహించి యుండుటయు సర్వము నీ కది దృష్టమే కదా.

1071


తే.

సాధునుతశీల నీప్రవాసనమునందు, నగరజనముచే నెద్ది యొనర్పఁబడియె
నట్టిరోదనశబ్ద మీవట్టితేరుఁ, దేఱి చూచిన శతగుణాధికము గాదె.

1072


తే.

ఇనకులోత్తమ యీదుఃఖ మెల్లవారి, కోడ కేనె యొనర్చినవాఁడ నగుదు
నన్నియు న టుండ నిమ్ము ధరాధినాథు, శోకతాపంబు నా కటు చూడ వశమె.

1073


తే.

దోష మని యెన్న కిటు నన్ను దుఃఖవార్ధి, లోనఁ బడఁద్రోచి పోవంగఁ బూనితే మ
హాత్మ దయ మాలి యట్లైన నసువు లిపుడె, విడుతుఁ గా కేల పోదు నవ్వీటి కధిప.

1074


సీ.

రాజవంశాంభోధిరాజ ని న్నిటఁ బాసి యే నొంటిఁ బురమున కేగ నచట
మీతల్లి కౌసల్య నాతనూభవు నెందు విడిచి వచ్చితి వని యడుగు నామె
కేమని చెప్పుదు నోమహాదేవి నీకొడుకును మాతులకులమునందు
డించి వచ్చితి నూఱడిల్లుము నీ వని చెప్పుదునే దానఁ దప్పు గలుగు


తే.

మానితాచారు నీపుత్రుఁ డైనరాము, నడవిలో డించి వచ్చితి నంటి నేని
పిడుగువంటియీవాక్యంబు నొడివినంతఁ, దడయ కప్పుడె యసువులు విడువకున్నె.

1075


క.

జననుత యీహయరాజము, లనఘుని నినుఁ బాసి శూన్య మైనరథంబుం
గొని నేఁడు మరలఁ బట్టణ, మున కేగతిఁ బోవ నేర్చుఁ బురుషశ్రేష్ఠా.

1076

సుమంత్రుఁడు తానును రామునితోడ వనమునకు వచ్చెద ననుట

వ.

దేవా ప్రియదర్శనుండ వైననిన్నుం బాసి నిమిషం బైన జీవింపంజాల నీతోడ
వనంబునకుం జనుదెంచెద ననుగ్రహింపు మ ట్లీయకొనవేని రథంబుతోఁ గూడ
నగ్నిప్రవేశంబుఁ జేసెద నని పలికి వెండియు ని ట్లనియె.

1077


మ.

అనఘా దారుణకంటకద్రుమశిలావ్యాప్తంబు లై నట్టియా