క. |
సాదరమునఁ బరిమళశీ, తోదకపరిపూర్ణ మగుచు నొప్పెడిదాని
న్వేదశ్రుతి యనువరనది, నాదశరథసుతుఁడు దాఁటి యవ్వలఁ జనుచున్.
| 996
|
క. |
విమలోదక యై కమనీ, యమరాళరుతాభియుక్త యై గోకులయు
క్తమనోజ్ఞానూపక యై, యమరెడుగోమతిని దాఁటి యరుగుచు నవలన్.
| 997
|
క. |
నవరాజీవోత్పలకై, రవగతమకరందలుబ్ధరమ్యభ్రమరీ
రవనాదిత యై యొప్పెడు, నవజల యగుస్యందికాఖ్యనదిని దరించెన్.
| 998
|
వ. |
ఇ ట్లమ్మహానది నుత్తరించి తొల్లి యిక్ష్వాకునకు మను వొసంగినట్టి స్యందికాఖ్య
నదీమర్యాదం బైనదాని నవాంతరజనపదావృత మగుదానిఁ గోసలదేశవిశేషం
బు వైదేహికిం జూపుచు నతిత్వరితగమనంబునం బోవుచు సుమంత్రు నవలోకిం
చి మత్తహంసస్వరంబున ని ట్లనియె.
| 999
|
చ. |
కడఁగి చతుర్దశాబ్దములు కాననవాస మొనర్చి క్రమ్మఱం
దడయక నేగుదెంచి తలిదండ్రులు కామితము ల్ఘటింపఁగా
నుడుగక రేపుమాపు సరయూతటపుష్పితకాననంబునం
దడరినకౌతుకంబు చెలువారఁగ నెన్నఁడు వేఁట సల్ఫెదన్.
| 1000
|
రాముఁడు జనపదనివాసు లగుజనుల నూఱడించుట
వ. |
వేఁట శిష్టాచారం బగునే యని యంటి వేని.
| 1001
|
సీ. |
అనఘాత్మ యీలోకమందు రాజర్షుల కడవిలో వేఁట క్రీడార్థ మగుట
నవసరం బెఱిఁగి సదాచారపరులచే మానక స్వీకృతం బైనదానిఁ
జలవేధనార్థంబు శరచాపధరులచే ననిశ మాకాంక్షితం బైనదాని
సరయూనదీతీరసంజాతవనములో నించుక వేఁటఁ గావించువాఁడ
|
|
తే. |
నరయ రాజుల కీరీతి యవనిలోన, నతుల మై సమ్మతం బయి యలరుచుండు
ననుచు నీభంగి రాఘవుఁ డమృతమధుర, భాషణంబులఁ బలుకుచుఁ బ్రాభవమున.
| 1002
|
వ. |
శీఘ్రంబున నగస్త్యదిశాభిముఖుం డై పోవుచు విశాలంబు లగుపురంబు లర
ణ్యంబులు గ్రామంబులు విలోకించుచుఁ గోసలదేశాంతంబుఁ జేరి యయోధ్యా
భిముఖుం డై యారబ్ధవ్రతనిర్విఘ్నపరిసమాప్త్యర్థంబు నిర్గమనసమయంబున
శిష్టాచారప్రాప్తపురదేవతానమస్కారంబునకు సంకటంబుచేత నవకాశంబు
లేమిం జేసి యమ్మహాపురివలన ననుజ్ఞఁ గొనువాఁడై కేలుదోయి ఫాలంబునం
జేర్చి యి ట్లనియె.
| 1003
|
ఉ. |
ఓపురరాజమా సురపురోపమధామమ నీకు నిత్యముం
గాపుగ నున్నదైవతనికాయముతోఁ దగ నాన తిమ్ము మా
కీవనిఁ దీర్చి క్రమ్మఱ నహీనగతిం జనుదెంచి యవ్వలం
జూపులవిందు గాఁగ నినుఁ జూచెద మింత యనుగ్రహింపవే.
| 1004
|
వ. |
అని పలికి భక్తిపూర్వకంబుగా నమస్కరించి పదంపడి దర్శనార్థం బరుగు
|
|