Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/424

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డాజానుస్థిరబాహుఁ డంచితఘనశ్యాముండునుం బూర్ణిమా
రాజాస్యుండు ముహారథుండు ఘనుఁ డారాముండు నానావనీ
రాజి న్శోభిలఁ జేయుచుండు నెపుడు న్రంగత్తనూరోచులన్.

991


తే.

మఱియుఁ బూర్వాభిభాషియు మధురభాషి, యైనరాముండు శశిభంగి నడవియందు
సమదదంతియానంబున సంచరింపఁ, గని విపినవాసులు ముదంబుఁ గాంతురు కద.

992


వ.

అని యిట్లు నాగరస్త్రీలు బహుప్ర కారంబులు భోజనమజ్జనశయనాదు లుడిగి
నానావిధదీనాలాపంబుల విలపించుచు మృత్యుభయాగమంబునందుం బోలె
నాక్రందనంబు సేయుచుండఁ దదీయదుఃఖంబు సహింపలేనివాఁడు పోలె
సూర్యుం డస్తమించెఁ బదంపడి రాత్రి ప్రవర్తించె నప్పుడు సాకేతనగరంబు
గాఢసంతమసపరిపూర్ణం బై నష్టజ్వలనసంపాతం బై ప్రశాంతాధ్యయనపుణ్య
కథేతిహాసం బై శూన్యవిపణిమార్గం బై ప్రణష్టహర్షం బై నిరాశ్రయం బై నష్ట
నక్షత్రగ్రహం బైనయంతరిక్షంబు ననుకరించె మఱియు సప్పురస్త్రీలు వినయ
వివేకప్రియంబులచేతఁ దమసుతులకంటె నధికుం డైనరామునిం దలంచి భ్రాతృ
పుత్రసహితంబుగా రోదనంబు సేయుచుండిరి ప్రశాంతనృత్యోత్సవగీతవాద్యం
బై నిరానందం బై యపగతపణ్యవస్తుప్రసారణం బై యయోధ్యానగరంబు
సంక్షుభితోదకం బైనమహార్ణవంబుభంగి నయ్యె నిట రాముండు తమసాతీరం
బునఁ బురజనుల విడిచి నాఁటిరాత్రి వేఁగునంతకుం జని సూర్యోదయసమ
యంబున నాహ్నికకృత్యంబులు దీర్చి పితృవాక్యపరిపాలనక్షముం డై దూ
రంబు చనిచని కోసలదేశాంతంబు డాసి వికృష్టసీమాంతంబు లగుగ్రామం
బులును బుష్పితకాననంబులును విలోకించుచు సీతాలక్ష్మణసహితుం డై పోవు
చుండ నప్పు డచ్చటి గ్రామోపగ్రామనివాసు లగుజనంబులు రామునివన
ప్రయాణంబుఁ జూచి తమలో ని ట్లనిరి.

993

వనంబునకుఁ బోవురామునిఁ జూచి గ్రామనివాసులు దుఃఖించుట

సీ.

అక్కట దశరథుఁ డాలిమాటకుఁ బ్రియపుత్రు నేగతి వనంబునకుఁ బనిచెఁ
దనవంశధర్మంబు దప్పి కైకేయి మగనికి దుర్నయ మెట్లు గఱపె నీతఁ
డసమానబాహుబలాఢ్యుఁ డయ్యును దాని హితమతిఁ దా నెట్లు నీయకొనియె
సతిసుఖోచితముగ్ధ యబల మహాసుకుమారి యీధరణీకుమారి యెట్లు


తే.

భయదవనమున నిడుములు వడఁ దలంచె, నెంతయాపద వాటిల్లె నిపుడు వీరి
కేమి సేయంగఁ గలవార మీశ్వరాజ్ఞ, మీఱి నడువంగఁ దరమె యెవ్వారికైన.

994


క.

అని యీగతిఁ గోసలవిష, యనివాసులు దుఃఖతప్తులై విలపింప
న్ఘనుఁ డారఘుపతి వారల, యనూనదీనోక్తి వినుచు నటు చని మ్రోలన్.

995