Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డును సీతయును బాదగ్రహణపూర్వకంబుగా దశరథునకుం బ్రణామంబుఁ
జేసి కృతాంజలిపుటు లై తల్లిదండ్రులకు శుశ్రూష యొనర్పక వనంబునకుం
జనవలసెఁ గదా యనువిచారంబున దీనవదను లై ప్రదక్షిణంబుఁ జేసి
యనుజ్ఞఁ గొని పదంపడి మాతృదుఃఖసందర్శనంబువలన శోకసమ్మూఢుం డై
రాముండు సీతాసహితంబుగాఁ గౌసల్యకుం బ్రదక్షిణంబును బ్రణామంబునుం
గావించి తోడనె సుమిత్రచరణంబులకుం బ్రణమిల్లె లక్ష్మణుండును రాము
నియట్ల కౌసల్యకుం బ్రణామంబు లాచరించి నిజజనని యగుసుమిత్రచర
ణంబులు శిరంబు సోఁకఁ బ్రణమిల్లె నప్పు డద్దేవి దుఃఖించుచు నిజనందనుం
డగులక్ష్మణునిశిరంబు మూర్కొని ప్రేమాతిశయంబున ని ట్లనియె.

851


మ.

క్షితి నెవ్వాఁ డెడఁబాయ కెప్పుడును రక్తిన్ జ్యేష్ఠు సేవించువాఁ
డతులశ్రేయము నొందుఁ గావున సముద్యత్ప్రీతితో నీవు న
ద్భుతచారిత్రకుఁడైన రామునిఁ బదాంభోజాతసంసేవనా
రతిచే నెప్పుడుఁ గాచుచుండుము మహారణ్యంబునం బుత్రకా.

852


వ.

పుత్రా నీవు సుహృజ్జనంబునందుఁ బరమానురక్తుండ వైనను వనవాసంబు
కొఱకు నాచేత విసృష్టుండ వైతివి రామసేవయం దనవధానంబు గావింపకు
మతండు రాజ్యాభావంబున వ్యసని యైనను రాజ్యప్రాప్తిచేత సమృద్ధుం
డైనను నీకుఁ బరమగతి యై యుండు నెవ్వండు జ్యేష్ఠవశగతుం డై వర్తించు
నతనికిఁ బరమశ్రేయంబు ప్రాప్తం బగు నిక్ష్వాకుకులంబునం బుట్టినవారికి
దానంబును యజ్ఞంబులయందు దీక్షయు జ్యేష్టానువర్తనంబును రణంబుల
యందుఁ దనుత్యాగంబును బితృవాక్యకరణంబును సనాతనధర్మంబు గావున
రాముని సేవించుచు వనంబునకుం జను మని పలికి వనవాసంబునందుఁ బితృ
మాతృనగరస్మరణంబున మనశ్చాంచల్యంబు గలుగునో యని శంకించి తత్ప
రిహారంబుకొఱకు వెండియు ని ట్లనియె.

853


తే.

తనయశేఖర రాముని దశరథునిఁగ, గహ్వరీపుత్రికను నన్నుఁ గాఁగ దండ
కాటవి నయోధ్యఁగా హృదయమున నెఱిఁగి, భూరిసుఖలీల నడివికిఁ బోయి రమ్ము.

854


వ.

అని పలికి మఱియును.

855


తే.

రాజనందన దశరథు రామునిఁగను, నన్ను జనకాత్మజను గాఁగ నయముతో న
యోధ్య నటవిఁగాఁ దలఁచుచు యుక్తభంగిఁ, నన్నతోఁ గూడి చనుము ఘోరాటవులకు.

856


తే.

దశరథకుమార రాము మాధవునిఁ గాఁగ, జనకపుత్రిని క్షీరాబ్ధితనయఁ గాఁగ
భూరిగహనంబు వైకుంఠపురము గాఁగ, నెఱిఁగి సుఖలీల వనమున కరుగు మీవు.

857