Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బూన్చి తెమ్ము నాథుండును వీరోత్తముండు నగురాముండు తల్లిదండ్రులచేత
వనంబున కనుపంబడియె నిదియె గుణవంతు లగువారిగుణంబులకు ఫలం బని
యెంచెద నని దుఃఖాతిశయంబునం బలికిన విని యతండు రాజానుమతంబున
సువర్ణరత్నభూషితం బైనరథం బాయితంబుఁ జేసి తెచ్చి ముందటం బెట్టి కృ
తాంజలిపుటుం డై కొలిచి యుండె నప్పు డద్దశరథుండు దేశకాలజ్ఞుండును
బాహ్యాభ్యంతరబుద్ధియుక్తుండును దత్తత్కాలోచితవస్తువిషయనిశ్చితజ్ఞానవం
తుండు నగుధనాధ్యక్షుని రావించి మంజువస్త్రంబులును మణిభూషణంబులును
బదునాల్గువర్షంబులకుం జాలునట్లుగా వేర్వేఱ వైదేహి కొసంగు మని పంచిన
నతండు కోశగృహంబునకుం జని వస్త్రాభరణంబులు దెచ్చి యద్దేవి కొసంగిన
నయోనిజయు సాముద్రికోక్తసర్వలక్షణసంపన్నయు నగు నమ్మహీపుత్రి
వివిధవిచిత్రప్రభాపటలజటిలంబు లగుమణిభూషణంబులు దాల్చి ప్రాతః
కాలంబున నంతరిక్షంబు నలంకరించు భానుప్రభయునుం బోలె నమ్మహామంది
రంబు వెలుంగం జేయుచుండె నప్పు డప్పుడమికన్నె నవలోకించి భుజంబులం
బరిష్వజించి శిరంబు మూర్కొని బాష్పధారాపూరితముఖ యై కౌసల్య యి
ట్లనియె.

835

కౌసల్య సీతకు హితోపదేశముఁ జేయుట

క.

క్షితిలోన నసతు లెంతయు, సతతము నిజవిభులచేత సత్కృత లయ్యుం
బతి కృఛ్రగతుం డగుచో, క్షితితనయా నిగ్రహంబు సేయుదు రంతన్.

836


తే.

పార్థివాత్మజ మున్నలభర్తవలనఁ, బెక్కుసుఖములు వడసియుఁ బృథివిలోన
వరున కొక్కింతయాపద వచ్చినప్పు, డతని విడుచుట యసతుల కాత్మగుణము.

837


తే.

కల్ల నిజముగఁ బల్కుట కలుషవృత్తి, కఠినచిత్తంబుఁ దాల్చుట కపటబుద్ధి
తవిలి పురుషుని వంచించి తనకుఁ దలఁకు, వానిఁ జేయుట యసతులవర్తనములు.

838


క.

విపరీతకర్మయుక్తలు, కపటవచోరతలు కృతము గాననికుమతు
ల్చపలాత్మలు వారి మనః, కపటత్వము దెలియరాదు గా పురుషులకున్.

839


తే.

ధర నవిశ్వసనీయలు దురితచిత్త, లగుటఁ గులకృతదానవిద్యాదికములు
సంగ్రహంబును నసతుల స్వాంతవృత్తిఁ, గ్రమ్మఱింపంగఁ జాలవు రాజతనయ.

840


క.

సతులకుఁ గాంతామణి సు, శ్రుతశమదమసత్యశీలసుగుణములందు
న్మతి సేయునట్టివారికిఁ, బతి యొక్కఁడె గతియు నతఁడె పరమార్థ మిలన్.

841


వ.

కావున మత్తనయుండు ధనవంతుం డైనను నిర్ధనుం డైనను నీకు దైవం బ
ట్లగుటం జేసి యమ్మహాపురుషునిఁ బరిచర్యాభక్తియోగంబులు నిత్యంబును
సేవించుచుండు మని పలికిన ధర్మార్థసహితం బైనయక్కౌసల్యవాక్యం బెఱింగి
కృతాంజలి యై యద్దేవి కి ట్లనియె.

842


మ.

క్షితిలో మెచ్చుగ నాకుఁ దొల్లి పతిసంసేవావిధం బంతయుం