Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


లిచట విడిచి పిదప నే మందఱము చను, వార మతఁడు వోవు ఘోరవనికి.

815


తే.

తండ్రిచే ధర్మయుక్తి దత్తంబు గాని, యుర్విఁ బాలింప భరతుఁ డర్హుండు గాఁడు
నృపతికి జనించు టది నిక్క మేని యింకఁ, దల్లివలె నిన్నుఁ జూడఁడు తథ్య మపుడు.

816


ఆ.

మఱియు విషయజనులు పురజనంబులు దండ, నాయకులు సతీసహాయు లగుచు
నెచట రామభద్రుఁ డింపార వసియించు, నచటి కిపుడె వోదు రనృతశీల.

817

దశరథుఁడు కైకేయి యన్యాయంబు నుగ్గడించుట

వ.

 దుష్టచారిణీ నీవు భూతలంబున నుండి గగనంబున కెగసినఁ బితృవంశచరిత్ర
విశారదుం డగుభరతుండు భవన్మతం బంగీకరింపఁడు పుత్రవినాశిని వగునీచేత
భరతున కప్రియంబు గావింపంబడియె మఱియు లోకంబున నెవ్వాఁడు రాముని
ననుసరింపకుండు నతని లేనివానిఁగా నెఱుంగుము పశువ్యాళమృగద్విజంబులు
ను బాదపంబులును దదున్ముఖంబు లై రామునితోఁగూడ వనంబున కిపుడె పోవఁ
గలయవి తత్ప్ర కారంబు విలోకింపం గలవు భరతుండును శత్రుఘ్నుండును రా
మునియట్ల తాపసవేషంబులు దాల్చి దండకారణ్యంబున వసియింతు రంతట గత
జనం బై శూన్యాకృతినున్నయిప్పురంబు చేకొని విగతఫలంబు లైనవృక్షంబుల
కాధిపత్యంబు సేయుచుండుము మఱియు రాముండు లేనిపురం బరణ్యసమా
నం బగు నమ్మహాత్ముండు వసియించియున్ననెలవు విపినం బైనను నానాజనశోభితం
బైనపురం బై యుండు నుఱియు నొక్కరామునివనవాసంబే నీచేతఁ బ్రార్థితం
బైనయది గాని వరప్రదానంబునందు సీతావనవాసంబు ప్రార్థితం బైనయది
గాదు కావున నలంకారనియత యైనయీసీత సర్వాలంకారభూషితయై మహా
ర్హయానపరిచారకవస్త్రభూషణోపకరణసహితంబుగా వనంబునకుం జని యందు
రామునితోఁ గూడ నివసించి యుండం గలయది నీ వీవైదేహికి దివ్యాంబరా
భరణమాల్యాదు లొసంగి వల్కలంబులు గ్రమ్మఱిఁ బ్రతిగ్రహింపు మని
యిట్లు కైకేయిం బదరి పలికి జానకిని నివారించిన నద్దేవి యమ్మహాత్ముఁ డెంత
జెప్పిన నుడుగక పత్యనుకారకామ గావున నిజవల్లభునిరూపంబున కనురూపం
బుగా వల్కలంబు ధరించె నప్పు డచ్చటిజనంబు లందఱు దుఃఖించిన నమ్మహా
ధ్వని విని దశరథుండు శోకవ్యాకులితచిత్తుం డగుచు యశోధర్మజీవితంబు
లయందుఁ బ్రియత్వంబు విడిచి నిట్టూర్పు నిగిడించి కైకేయి నవలోకించి
యి ట్లనియె.

818


సీ.

పుట్టి యెన్నఁడు దుఃఖముల నెఱుంగక సరసాన్నంబుఁ గుడిచి చీనాంబరములఁ
దాల్చి మహోన్నతిఁ బొల్చి యుండెడునట్టియీబాల యీగోల యీసుఖార్హ
యీమహాసుకుమారి యీధరిత్రికుమారి కుశచీరఁ దాల్చి యాకులత కోర్చి
ఘోరవనావని కేరీతిఁ బో నేర్చు గురునివాక్యంబు నిక్కువము సువ్వె


తే.

ఘనసుఖోచిత యైనయీ జనకకన్య, తనయలంకారరూప మంతయును విడిచి