|
ధరణి యంతయుఁ జేకొని భరతుఁ డేలుఁ, గాక నీమాట కనృతంబు గలదె యధిప.
| 764
|
క. |
ఫలమూలంబులు మెసవుచు, సొలయక గిరినదులు వేడ్కఁ జూచుచు సౌఖ్యం
బలరారఁ గాననంబునఁ, గలయఁగఁ జరియింతు సుఖివి గ మ్మిట నీవున్.
| 765
|
సుమంత్రుఁడు కైకేయి నధిక్షేపించి దూఱుట
వ. |
అని పలికిన నద్ధరారమణుండు శోకసంతప్తచిత్తుండై కొడుకుం గౌఁగిలించుకొని
మోహవిశేషంబున రోదనంబు సేయుచు నొక్కింతసేపు నష్టచేష్టితుం డై
యుండెఁ గైకేయిదక్కఁ దక్కినరాజపత్ను లందఱు హాహాకారంబులు సేయు
చు మూర్ఛాక్రాంత లైరి సుమంత్రుండును దుఃఖాతిశయంబున వినష్టచేత
నుం డై ధరణిపయిం బడియె ని ట్లందఱుఁ కొండొకసేపు వివశు లై హాహాకా
రంబులు సేయుచుండి వెండియుం దేఱినయనంతరంబ సుమంత్రుండు కటకటం
బడి క్రోధాతిశయంబున శిరఃకంపంబు సేయుచు నిట్టూర్పులు పుచ్చుచు
బొమలు ముడివడఁ గన్నులం గెంజాయ రంజిల్లఁ గైకేయిదిక్కు మొగం బై
మహీపతిమనోవిధం బంతయు నెఱింగి నిశితంబు లగువాక్శరంబులచేత నద్దేవి
హృదయంబుఁ గంపింపంజేయుచు వజ్రోపమానంబు లగువాక్యంబులఁ దదీయ
మర్మంబులం గలంచుచు దేవి యెద్దానిచేత భర్తయు స్థావరజంగమాత్మకం
బైనసర్వజగంబునకు నాథుండు నగుదశరథుండు విడువంబడియె నట్టినీకు
నింకఁ జేయరానికార్యం బొక్కింత యైనఁ గలుగదు మహేంద్రుండునుఁబోలె
నజయ్యుండును మహాశైలంబునుం బోలె నప్రకంప్యుండును మహార్ణవంబునుం
బోలె నక్షోభ్యుండు నగుమహీపతి నీక్రూరవ్యాపారంబులఁ బరితపింపంజేయుట
వలన నిన్నుఁ బతిఘ్ని వనియుఁ గ్రమంబునఁ గులఘ్ని వనియుఁ దలంచెద నని
పలికి వెండియు ని ట్లనియె.
| 766
|
తే. |
తనయు లొకకోటి గల్గిన ధరణిలోన, నంబుజాక్షికి భర్తృమనోనుసరణ
మరయ నిఖిలార్థసాధన మై చెలంగుఁ, గానఁ బతినింక నేఁచక గావు మబల.
| 767
|
తే. |
అతివ యిక్ష్వాకుకులవిభుం డితఁడు సుగతి, కరిగినయనంతరంబ జ్యేష్ఠానుపూర్వ
కముగ రాజ్యభారముఁ దాల్సఁగలరు పుత్రు లిపుడు తద్ధర్మ మేల లోపించె దకట.
| 768
|
మ. |
అమలుం డీనృపుఁ డట్టివానిపయిఁ బూర్వాచారధర్మంబు హై
న్యము నొందింపఁ దలంచి తీవు జననింద న్నీసుతుం డాధిప
త్యముఁ గావించుచు నుండనిమ్ము చెలువొంద న్మేము నిత్యంబు దా
వమున న్రామునిఁ గూడి నిశ్చయమతిన్ వర్తింతు మిచ్ఛారతిన్.
| 769
|
ఆ. |
యోగ్యుఁ డైనవిప్రుఁ డొక్కరుండైన నీ, విషయమందు నిలిచి వెలయఁజాలఁ
డట్టిపాపకర్మ మాచరించితి వేనిఁ, జెట్టఁదన మిఁ కేమి చెప్పవచ్చు.
| 770
|
తే. |
రామునకు నెగ్గు సేయఁ దలంచియున్న, నీకు బ్రహ్మర్షి వాగ్దండనికర మేల
హింస సేయదు నీవు కాలిడిన పుడమి, వ్రయ్యలై పోవ దేల చిత్రంబు గాదె.
| 771
|