Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/385

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


డనియెం గ్రమ్మఱ నోదినేశకులవర్యా మీయనుజ్ఞ న్భవ
జ్జననిన్ మజ్జనని న్నితాంతసముదంచద్భక్తిచే సంతతం
బును శుశ్రూష యొనర్చుచు న్భరతుఁడే పోషించు జాగ్రత్తతోన్.

701


తే.

దేవ యేదేవికృప నుపజీవిశతము, లగ్రహారశతంబుల నధిగమించె
నట్టికౌసల్య మాదృక్సహస్రములను, సంతతముఁ బ్రోచు స్వభరణ మెంత చెపుఁడి.

702


క.

ఆయమ్మఁ గూడి నిత్యము, మాయమ్మయు నెగులు దక్కి మహితసుఖాప్తిం
బాయక సేవించును దే, వా యీయెడ సందియంబు వలవదు బుద్ధిన్.

703


వ.

దేవా న న్ననుచరునిఁగాఁ బరిగ్రహింపు మీయనుచరత్వకరణంబునందు సేవ్య
సేవకధర్మరాహిత్యంబును వైపరీత్యసాధనంబును లేదు నారాకవలన నీకు
ఫలమూలాద్యాహరణం బనాయాసంబుగాఁ గల్పింపంబడు నేనును భవత్సేవ
వలనఁ గృతార్థుండ నగుదు నట్లు గావున.

704


క.

నిరుపమఖనిత్రపిటకా, ధరుండ నై సగుణ మైన ధనువుఁ గొని వెసం
దెరు వెఱిఁగించుచు ముంగల, నరుదెంచెద న ట్లొనర్పుమయ్య మహాత్మా.

705


చ.

పవలు సమస్తవన్యఫలపంక్తులఁ దెచ్చి యొసంగుచు న్నిశ
ల్సవినయబుద్ధి బద్ధగుణచాపముఁ దాల్చి సుషుప్తిఁ దక్కి క
న్గవ కటు ఱెప్ప వ్రేయక సుఖస్థితి నెప్పుడుఁ గాచుచుండఁగా
నవనిజఁ గూడి నీవు గిరులందు విహార మొనర్చు టొప్పదే.

706


క.

అని యిట్లు సుమిత్రానం, దనుఁడు వివిధవినయవాక్యనైపుణ మలరం
దను వేఁడినఁ గౌసల్యా, తనయుఁడు హర్షించి మరలఁ దమ్మున కనియెన్.

707

రాముఁడు లక్ష్మణవనాగమనంబున కొడంబడుట

వ.

వత్సా యేను నీవనప్రయాణంబున కొడంబడితి నాతోడం జనుదెమ్ము జనకయ
జ్ఞంబునందు మహాత్ముం డగువరుణుం డొసంగిన మహాకార్ముకంబులును నభేద్య
కవచంబులును నక్షయబాణతూణీరంబులును హేమపరిష్కృతం బగుఖడ్గద్వ
యంబునుఁ బూజార్థం బాచార్యుమందిరంబున నిక్షేపించి యున్నయవి వానిఁ
గైకొని యిష్టులకుం జెప్పి ర మ్మనవుడు నతండు వనవాసనిశ్చితుం డగుచు సుహృ
జ్జనంబుల నందఱివలన నామంత్రణంబు వడసి సంభ్రమంబున వసిష్ఠగృహంబు
నకుం జని ధనురాదిసాధనంబులఁ గొని రయంబునఁ బఱతెంచినం జూచి కాల
విడంబనంబు సేయక చనుదెంచితి వని బహూకరించి వెండియు రఘువల్లభుం
డి ట్లనియె.

708


క.

అనఘాత్మ మామకం బగు, ధనమును విప్రోత్తములకు దానము సేయం
జనుఁ గాన నిపుడె సని దో, డ్కొని రమ్ము సుయజ్ఞునిం బటుత్వరితగతిన్.

709