తే. |
మఱియు నద్దేవి విషదిగ్ధశరనివిద్ధ, యైనకరిణిచందంబున నధిపవాక్య
విద్ధయై ఘనచిరసన్నిరుద్ధలోచ, నాశ్రువులు నించె నరణి ఘోరాగ్ని నట్ల.
| 681
|
తే. |
స్ఫటికసమములు సంతాపసంభవములు, నగులసద్బాష్పబిందువు లపుడు చాల
జలజలోచనకన్నులవలనఁ దొరఁగెఁ, గమలదళములవలన నీరములుఁ బోలె.
| 682
|
రాముఁడు సీతను వనమునకుఁ దోడుకొని పోవుటకు సమ్మతించుట
తే. |
లలితకైరవమిత్రమండలసమంబు, దీర్ఘదృశ్వ్యాప్త మైనతదీయవచన
మపుడు బాష్పముచే శుష్క మగుచు నొప్పె, జలసముద్ధృతనవపంకజంబుకరణి.
| 683
|
క. |
అప్పుడు రఘునాథుఁడు దయ, ముప్పిరి గొన దుఃఖవేగమునఁ గ్రాఁగెడు నా
కప్పురగంధినిఁ గుతుకము, కుప్పలు గొనఁ గౌఁగిలించుకొని యి ట్లనియెన్.
| 684
|
చ. |
అమలశశాంకబింబవదనా విను మెంతయు నీవియోగదుః
ఖమున లభించునట్టిబలఘస్మరుసంపద యైన నాదుచి
త్తమునకు నించుకైనఁ బ్రమదం బొనగూర్ప ద దెల్లచోటులం
గమలజసూతికిం బలెను గల్గదు నాకు భయం బొకింతయున్.
| 685
|
ఉ. |
ఆయతశక్తిరక్షణమునందు సమర్థుఁడ నయ్యు నీయభి
ప్రాయ మెఱుంగఁ గోరి వనవాసము వద్దని యంటిఁ గాక వి
చ్చేయుము నాదువెంట వనసీమకు ని న్నెడఁబాయఁజాల నీ
తోయము ద్రిప్ప నాతరమె తోయరుహాయతచారులోచనా.
| 686
|
వ. |
దేవి నీవు నాతోఁగూడ వనవాసంబుకొఱకు నిప్పుడు నిశ్చయించితివి గావున
శీలవంతునిచేతఁ గీర్తియుంబోలె నాచేత విడువ నశక్య వైతివి ధర్మాత్ము లగు
పూర్వరాజులచేతఁ బత్నీసమేతంబుగా వానప్రస్థధర్మం బాచరింపబడియెఁ
గావున నేనును సువర్చల సూర్యుని ననువర్తించినకైవడిఁ బూర్వరాజాచరి
తధర్మంబు ననుసరించెద సత్యోపబృంహితం బైనతండ్రివచనంబు నన్ను వన
వాసంబుకొఱకుఁ దొరసేయుచున్నది. శీఘ్రంబున వనంబునకుం బోవవలయుఁ
దల్లితండ్రులకు విధేయుండై యుండు టదియె పుత్రునకుఁ బరమధర్మంబు గా
వున నమ్మాతాపితృవిధేయత్వరూపధర్మంబు నతిక్రమించి యేను జీవింపఁజాల.
| 687
|
రాముఁడు సీతకు గుర్వాజ్ఞానువర్తనధర్మమును బ్రశంసించి చెప్పుట
తే. |
వినుము స్వాధీన మగుమాతృపితృగురుస్వ, రూపదైవంబు నవలఁ బోఁ ద్రోచి తనకు
వశముగానట్టి యన్యదైవంబు నెట్లు, మచ్చకంటి యారాధింపవచ్చుఁ జెపుమ.
| 688
|
తే. |
ఎచటఁ బితృమాతృగురురూప మెసఁగుచుండు, నచట లోకత్రయం బుండు నట్లు గాన
దేవి తత్సేవచే జగత్త్రితయవర్త్య, శేషదేవపూజనఫలసిద్ధి గలుగు.
| 689
|