Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/381

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వ.

అని కోపంబు పెంపున నాక్షేపించి వెండియు ని ట్లనియె.

668


క.

తప మైన నాక మైనను, విపిన మయిన నిరువురకును వెస నొక్కటి యా
విపరీత మేల పల్కెదు, చపలత లేకుండ వనికిఁ జనుదెంతు రహిన్.

669


తే.

నిన్నుఁ గూడి వనంబున నున్నవేళ, నిడుమ లెన్నియుఁ గలిగిన హృదయమునకు
స్వర్గభోగసమాన మై వఱలు నాకు, దేవ తోడ్కొని పొమ్ము సందియము దక్కి.

670


ఆ.

అధిప నీపిఱుంద నరుదెంచునాకు ను, ద్యానవనవిహారమందుఁబోలె
నధ్వమం దొకింతయైన నాయాసంబు, గలుగ దిడుమ లనుచుఁ దలఁప వలదు.

671


మ.

మనుజేంద్రోత్తమ నిన్నుఁ గూడి యటవీమార్గంబునం బోవునా
కనిశంబుం గుశకాశముఖ్యకఠినజ్యాజాతముల్ భూరిశో
భససంధాయకతూలతల్పకసమస్పర్శంబు లై యుండు న
న్ననుమానింపక నీదువెంటఁ గొని పొమ్మా కాననక్షోణికిన్.

672


తే.

అధిప ఝంఝానిలోద్ధూత మైన యేర, జంబుచే నస్మదీయగాత్రంబు చాల
ధూసరిత మగు నమ్మహీధూళి నతుల, చందనముగాఁ దలంపుదు డెందమందు.

673


తే.

చెలఁగి నీతోడ వనమధ్యసీమయందు, రమణ శయనించుతఱి శాడ్వలములకంటె
సదనమునఁ గల్గుఘనచిత్రమృదులతరకు, థాస్తరణతల్పకము లంత యధిక మగునె.

674


తే.

అధిప నీవు కాంతారమధ్యంబునందుఁ, గరుణఁ జేసి యొసంగిన కందమూల
ఫలపలాశాదికములు స్వల్పంబు లైన, నవియె నాకు సుధాభంబులని తలంతు.

675


క.

జనకుని తల్లిని గృహమును, మనమునఁ దలపోయ నెపుడు మత్కృతమున నీ
కనిశము శోకము గలుగదు, ననుఁ దోడ్కొని పొమ్ము కాననంబున కధిపా.

676


క.

నినుఁ గూడి యున్నచో టది, వన మైనను స్వర్గసన్నిభం బగు మఱియు
న్నినుఁ బాసి యున్నచో టది, ఘనపట్టణ మైన నారకసమం బధిపా.

677


క.

కావున ననుఁ దోడ్కొని విపి, నావలికిం బొమ్ము దేవ యటు గానియెడ
న్నీ వవలోకింప విషముఁ, ద్రావి యయిన నిపుడె జీవితంబులు విడుతున్.

678


ఉ.

అక్కటికంబుఁ బూని హృదయాధిప న న్విడనాడి కానకున్
గ్రక్కున నీవు పోవ నసుఖస్థితి నవ్వల నైన మేనిలో
నిక్కడఁ బ్రాణము ల్నిలువ వింతయు నిక్కము గాన నవ్వలన్
దిక్కఱి చచ్చుకంటె దగ నీయెదుర న్మఱి చచ్చు టొప్పదే.

679


చ.

అనఘ భవద్వియోగజనితార్తిని నొక్కముహూర్తకాల మై
నను భరియింపఁజాలఁ బదునాలుగువర్షము లెత్తెఱంగునన్
మనమున నోర్చి యుందు నని మానిని దుఃఖవిధూయమాన యై
తనపతిఁ గౌఁగిలించుకొని తద్దయు నేడ్చెఁ గలస్వనంబునన్.

680