Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/355

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

జనవిభున కగ్రసతి నై, కనిష్ఠ లగుసవతు లెల్లఁ గడుగర్వమునన్
ననుఁ దూలనాడుచుండఁగ, విని యేగతిఁ దాళుదాన విమలవిచారా.

466


తే.

జనవినుత పుత్రయుత లగుసవతు లాడు, వివిధపరిహాసవచనము ల్వినుటవలనఁ
బుట్టు నాదుఃఖశోకంబు లిట్టి వట్టి, వనఁగ వచ్చునే వానికి నవధి గలదె.

467


ఆ.

పాయ కెపుడు నీవు నాయొద్ద నుండఁగ, నధికహీనవృత్తి నడలుచుందు
నీవు గహనమునకుఁ బోవుచుండఁగ నాకు, మరణమే నిజంబు వరగుణాఢ్య.

468


వ.

మఱియు నమ్మహీపతికి నగ్రపురంధ్రి నై యుండియు నతండు న న్నవమాన
పురస్సరంబుగాఁ జూచుటవలన నప్రధానీకృత నై కైకేయిపరిచారికాజనం
బునకంటె నొక్కింత యవర నైతి నదియునుం గాక భరతుండు ప్రాప్త
రాజ్యుం డైన నతని విలోకించి నిత్యంబు నన్ను సేవించుజనంబును వాని
భయంబువలన నింక నన్ను సేవింపకుండు నని పలికి వెండియు ని ట్లనియె.

469


చ.

అనిశము వైరిభావమున నద్భుతకోపరసంబు ముక్కునం
గనుపడ భాగ్యగర్వమునఁ గష్టదురుక్తులఁ బల్కు కైకయా
నన మెటు చూచి యోర్చెద ఘనంబుగ దుర్దశ నొంది యుండి నే
నినకులదీప మానవతు లీలఘుజీవన మోర్చి యుందురే.

470


సీ.

మది సుక్కు దక్కి సప్తదశాబ్దములనుండి యేక్షోభమునకుఁ బరిక్షయంబు
సతతంబు నాచేత నతికాంక్షితం బయ్యె నాక్షోభ మక్షయం బయ్యె నిపుడు
భాగ్యగర్వమున సపత్నులు గావించు విప్రకారము మది వెగటు పఱప
హీనదశాప్రాప్తి కే నోర్చి ధర మని యుండ లే నదియు నట్లుండ నిమ్ము


తే.

కమలపత్రంబులను బోలు కనులతోడఁ, బూర్ణశశిబింబసదృశ మై భూరికళల
నొప్పునీమోముఁ జూడక యొక్క నిమిష, మైన నేగతి జీవించుదానఁ దండ్రి.

471


వ.

వత్సా నీవు భాగ్యరహిత నైననాచేత నుపవాసదేవతాధ్యానవ్రతంబులచేత
నిష్ఫలం బగునట్లు సంవర్ధితుండ వైతివి భవదీయపరివర్ధనం బిప్పుడు దుఃఖం
బుకొఱకుఁ బరిణతం బయ్యెఁ బ్రావృట్కాలంబునందు మహానదీప్రవాహసలి
లంబుచేతఁ దత్తీరంబు నశించినపగిది భవద్విప్రయోగశ్రవణంబున సహస్ర
కారంబుల వ్రయ్య లైపోకయుండుటవలన మదీయహృదయం బతికఠినం
బని తలంచెద.

472


సీ.

వలనొప్ప కంఠీరవంబు బిట్టేడ్చెడు మృగిని గొంపోయినపగిది నన్నుఁ
గుద్దుఁ డై శమనుండు గొని పోనికతమున నల దండధరలోకమందు నాకు
స్థానంబు లే దని తలఁచెద నా కింక జగతి నెన్నటికిని జావు లేదు
కడువడి నిట్టిదుఃఖంబుచే నుపహతం బయ్యును నాహృదయంబు మేను


తే.

మాన కిట వేయివ్రయ్యలై పోనికతన, నాయసాకృతి గాఁబోలు నని దలఁచెద
నందన యకాలమున నిధనంబు గలుగ, దేమి సేయుదు నింక నా కేది దిక్కు.

473