Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/343

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యేకాగ్రమనస్కు లై పరస్పరానురక్తు లై యొప్పుయువపురుషులచేత నభిర
క్షిత మయిన వేఱొక్కకక్ష్య డాయం జని యందుఁ గాషాయకంచుకధారు లై
స్వయంకృతు లై సుసమాహితు లై యలరునంతఃపురద్వారరక్షకులఁ బరమవృ
ద్ధుల రామప్రియచికీర్షుల విలోకించి వా రందఱుఁ దన్ను సందర్శించి రయం
బువ నాసనంబుల నుండి లేచి ససంభ్రము లై యెదుర్కొని వారి నభినందించి
వినీతాత్ముండును సేవానిపుణుండు నగుసుమంత్రుం డి ట్లనియె.

394


తే.

చెలువు మీఱంగ మీరు లోపలికిఁ బోయి, రహి సుమంత్రుఁడు వచ్చి ద్వారమున నిలిచి
యున్నవాఁ డని నారాక యొప్పు మీఱ, మొనసి రామున కెఱిఁగింపుఁ డనిన వారు.

395


క.

రయమున లోపలికిం జని, ప్రియాసహితుఁ డైనరామవిభు నుచితగతిన్
నయ మారఁ గాంచి దెల్పిరి, ప్రియ మలర సుమంత్రురాక వినయముతోడన్.

396


క.

చెప్పిన నారఘుసత్తముఁ, డప్పుడు గుర్వంతరంగుఁ డయినసుమంత్రుం
దప్పక దోడ్తెమ్మని ముద, మొప్పఁగ సెల వొసఁగ వార లుత్సాహముతోన్.

397


వ.

శీఘ్రంబున మరలం జనుదెంచి సుమంత్రునకు రామశాసనం బెఱింగించిన
నతండు ప్రభూతరత్నం బగుసముద్రంబుఁ బ్రవేశించు మహామకరంబుకైవడి
మహావిమానోత్తమవేశ్మసంఘవంతం బైనయంతఃపురంబుఁ బ్రవేశించి యం
దొక్కసుమపర్యంకమధ్యంబున.

398

సుమంత్రుఁడు రామునికి దశరథనియోగం బెఱింగించుట

సీ.

కటితటి శోభిల్లు కౌశేయచేలంబు ఘనము చెంగటిమించుకరణిఁ దనర
హరిచందనార్ద్రకాయంబు సంధ్యారాగఘనయుక్తనీలాద్రిగతి వెలుంగ
ఘనహారకలితవక్షము లనన్నక్షత్రశోభితాభ్రముభంగి సొం పెలర్ప
నిరువంక సేవించుపరరాజకీర్తులకరణి ముత్యాలచౌకట్లు మెఱయ


తే.

రత్నహారంబు లురమునఁ గ్రాల వామ, భాగమున నుండి జానకి భర్మదండ
చామరము వీవఁ దారకాజానిభంగి, వెలయు రాఘవుని సుఖోపవిష్టుఁ గనియె.

399


క.

కని వినయజ్ఞుఁడు సూతుఁడు, మునుకొని తత్పాదమూలములు దల సోఁకం
బ్రణమిల్లి కృతాంజలి యై, వినయంబున నిట్టు లనియె విశ్రుతఫణితిన్.

400


క.

అనఘాత్మ నృపతి కేకయ, మనుజేంద్రకుమారికాసమన్వితుఁ డగుచు
న్నినుఁ జూడఁ గోరి ననుఁ దో, డ్కొని రమ్మన వచ్చితి న్బటుత్వరితగతిన్.

401


క.

నా విని రాముఁడు మోదం, బావిర్భవ మొంద సూతు నర్హవిధుల సం
భావించి వేగ సీతా, దేవికి ని ట్లనియె వదనదీధితు లడరన్.

402


క.

వనితా నృపతియుఁ గైకయు, ఘనబుద్ధి మదర్థమందుఁ గడువడి నభిషే
చనసంయుతపర్యాలో, చనమును గావించుచున్నచందము దోఁచెన్.

403