Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నించి యున్నసమయంబున నీవిభుం డరుదెంచి నీచిత్తంబు వడయుటకు బహు
రత్నసువర్ణభూషణాంబరమాల్యాదు లొసంగం జూచు మనోవిభ్రమకారణంబు
లైన యప్పదార్థంబులం దాస సేయక తొల్లి దేవాసురసంగ్రామసమయం
బున సంప్రీతుండై యొసంగెద నన్నవరంబు లిచ్చునంతకుఁ గోపంబు డింపకుండు
మట్లైన నతండు మోహవిశేషంబున నవ్వరద్వయం బొసంగువాఁడై కోర్కికిం
దనినప్రయోజనంబు లెఱింగింపు మని యడుగు నప్పుడు నీవు భయంబు
విడిచి యమ్మహీవిభుని సత్యంబునందు సంస్థాపించి పదునాల్గువత్సరంబులు
రామునకు వనవాసంబును భరతునకు రాజ్యాభిషేకంబును గోరు మతం డివ్వ
రంబు లనుమానంబు దక్కి యొసంగు నంతట రాముండు వనంబునకుం జనిన
భరతుండు సామ్రాజ్యపదవిఁ గైకొని వశీకృతమూలబలుం డై పగతులం బరి
మార్చి సంగృహీతమనుష్యుం డగుచు నిష్టజనంబులఁ గూడి మహీభార
ధౌరేయుండై యొప్పు నవ్వల నారాముందు చతుర్దశవత్సరంబులు వనవా
సంబు సల్పి గ్రమ్మఱఁ బురంబునకుం జనుదెంచెనేని భరతుని జయింప సామ
ర్థ్యంబు లేమింజేసి యూరకుండు నంతట రాముండు రాముం డయ్యెడు భర
తుండు చతుర్దశవర్షవ్యతిరిక్తపురుషాయుఃకాలం బంతయు నేకచ్ఛత్రాధిపత్యం
బుగాఁ బుడమి నేలుం గావున నెల్లభంగుల సందియంబు దక్కి నిర్బంధంబున
దశరథుని స్వాధీనుం గావించుకొని రామాభిషేకంబునకు విఘ్నంబు సేయు
మిదియే భరతునకుఁ బ్రాప్తకాలం బని పలికిన నక్కుబ్జపలుకుల కలరి యక్కై
కేయి యనుకూలార్థరూపంబునం బ్రతిబోధితమైనయయ్యవస్థంబుం బరిగ్రహించి
సంతసించి యమార్గగత యైనకిశోరచందంబున నవశయై మిక్కిలివిస్మయంబు
నొంది మంథర కి ట్లనియె.

230

కైక మంథరను శ్లాఘించుట

తే.

బుద్ధినిశ్చయమందు నీపుడమిలోనఁ, గలుగు కుబ్జలలో నగ్రగణ్య వైతి
వింతహితమతి వనుచు ని న్నెఱుఁగనైతి, నెంతశ్రేష్టాభిధాయినివే మృగాక్షి.

231


క.

సతతము మదర్థములయం, దతులితముగఁ గూడి యుందు వటుగావున భూ
పతి పూనినకార్యం బెఱిఁ, గితి నే నెఱుఁగంగనైతిఁ గేవలజడతన్.

232


వ.

ప్రియసఖి దారుణస్వభావలును వక్రరూపిణులును దుష్టావయవసంస్థానవిశేష
సంయుక్తలు నగుకుబ్జలు పెక్కండ్రు గలరు నీకు వారల సాటి సేయం దగదు
ప్రియదర్శన వగునీవు పద్మంబుకరణి వాతంబుచేత నమ్ర వైతి వైననేమి సహజ
సుందరం బయినపద్మంబు వాతంబుచేత నమ్రం బైన నె ట్లనింద్యం బై యుండు
నట్లు సహజసౌందర్యశాలిని వగునీవు వాతోద్రేకంబువలన వక్రత్వంబు నొం
దియు ననింద్య వైతి వని పలికి వెండియు ని ట్లనియె.

233