|
జనవర మాభాగ్యంబునఁ జనుదెంచితి వీవు వీర్యసముపార్జితనం
దనసంప్రీతిని బొందితి, వనుపమపుణ్యమున నేఁ గృతార్థుఁడ నైతిన్.
| 1227
|
క. |
సురపరివృతుఁ డగుశక్రుని, కరణి సమంచితమహర్షికలితుం డై మ
ద్గురుతరపుణ్యవశంబున, నరుదారఁగ నీవసిష్టుఁ డరుదెంచె గృపన్.
| 1228
|
తే. |
ఈమునీంద్రులఁ గూడి మహీశవర్య, నీవు విచ్చేయుకతమున నెగడె శుభము
విఘ్నము లడంగె గోర్కులు విస్తరిల్లె, నన్వయం బది పావనం బయ్యె నేఁడు.
| 1229
|
ఉ. |
తోయజమిత్రవంశజులతో దగ వియ్యము గల్గె సంతతం
బాయతకీర్తి నైతి మనూుజాధిప యెల్లి ముహూర్త మింక మీ
రేయెడ నెల్లకార్యముల కెంతయు జాలి ప్రసన్నచిత్తు లై
పాయక యుండు డంచు నిటు పల్కిన నయ్యజసూనుఁ డి ట్లనున్.
| 1230
|
క. |
అనఘచరిత్ర ప్రతిగ్రహ, మనిశము దాతృవశ మనిరి యటు గావున నీ
వొనరింపు మనిన గార్యం, బొనరించెద నిఁక స్వతంత్ర మున్నదె మాకున్.
| 1231
|
క. |
నిర్మలకీర్తికరంబును, ధర్మిష్టం బైనయట్టి దశరథువాక్యం
బర్మిలి విని జనకుఁడు నృప, ధర్మవిదుఁడు మిగుల నద్భుతము నొప్పు రహిన్.
| 1232
|
ఆ. |
అచట నున్నమౌను లంద ఱన్యోన్యస, మాగమంబునందు హర్షయుక్తు
లగుచు నతిసుఖముగ నారాత్రి వసియించి, రుచితిపదములందు నొప్పు మీఱ.
| 1233
|
క. |
మనుకులుఁ డగుదశరథనృపుఁ, డనఘుల నందనులఁ జూచి హర్షం బలరన్
జనకునిచేఁ బూజితుఁ డై ఘనమతి సుఖలీల నుండె గౌతూహలి యై.
| 1234
|
వ. |
అంత మహాతేజుం డగుజనకుం డవశిష్టయాగకర్మంబు నిర్వర్తించి యారాత్రి
వివాహాంగభూతం బైనయంకురార్పణాదికంబుఁ గావించి యథాసుఖంబుగా
వసియించి ప్రభాతకాలంబున సమాప్తయజ్ఞక్రియుం డై పురోహితుం డైన
శతానందు నవలోకించి యి ట్లనియె.
| 1235
|
జనకుండు దనతమ్ముం డగుకుశధ్వజుని రావించుట
సీ. |
అనఘాత్మ నాతమ్ముం డలకుశధ్వజుఁ డతిధార్మికుఁడు జగన్నుతప్రభుండు
గరిమ వార్యాఫలకప్రాంత మై మె యొప్పు నిక్షుమతీజల మింపుతోడఁ
గ్రోలుచు స్వర్గంబులీల విమానంబుకై డి నలరుసాంకాశ్యయందు
నలరారుచున్నవాఁ డతఁడు నాచందానఁ జెలఁగి యీప్రీతి భుఃజింప నర్హుఁ
|
|
ఆ. |
డతఁడు యజ్ఞగోప్త యతని విలోకింపఁ, గౌతుకంబు చాలఁ గలదు నాకుఁ
గానం దగినవారిఁ గడువడిఁ బుత్తెంచ్చి, పిలువ నంపు మతనిఁ బెండ్లిఁ జూడ.
| 1236
|
ఆ. |
అనుచు బలికి ప్రీతి నప్పుడే చారుల, నతనిపాలి కనుప హయము లెక్కి
సత్వరమున నేగి సముచితగతి గుశ, ధ్వజునిఁ గాంచి కుశలవార్తఁ దెలిపి.
| 1237
|
ఆ. |
ఇంద్రునాజ్ఞచే నుపేంద్రునిఁ దోడ్కొని, వచ్చిన ట్లనంతవైభవమున
జనకునాజ్ఞచేఁ గుశధ్వజుఁ దోడ్కొని, వచ్చి రపుడు వేగవంతు లగుచు.
| 1238
|