పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఓరుంగల్లు

91

కుమార్తె అయిన మల్ల మాంబిక నాగచమూపతి ఇల్లాలు. నాగచమూపతి తండ్రి మల్ల చమూపతి గణపతిదేవుని మహాసేనాపతులలో ఒకరు.

రాచకోట లోపలిగోడ ననుసరించి ఉపసేనాపతు లనేకుల భవనాలున్నాయి. అక్కడక్కడ సైన్యశాల లున్నవి. రాజోద్యోగు లనేకుల మేడలు రాచకోటలో పడమటిద్వారం దగ్గరగానున్నూ, ఉత్తరపు గోడపొడుగునా రాజకాది శూద్రుల గృహాలు, రాచవారి సేవచేసేవారి ఇళ్ళు ఉన్నాయి.

అన్నాంబికకు ఓరుగల్లు చూడడం ఇదే ప్రథమపర్యాయం. మహారాణి కుప్పసానమ్మతోపాటు ఆ బాలికకూడా మత్తగజంపై అంబారిలో అధివసించి ఓరుగల్లు నగర మహావైభవం ఆనందంతో పరికించుతున్నది. నగరబాహ్యంలో ఉన్నవాడలలోనికి పొలాలనుండి రైతులు తిరిగి వస్తున్నారు. చిన్నపూరిళ్ళు, చిన్న చిన్న ఇళ్ళు, మేడలు ఆ మహారాజపథానికి ఈవలావల వాడలలో ఉన్నాయి. నేత శాలలముందు నూలు పడుగులు చేస్తున్నారు. సన్నని నూలును ముతకనూలును భామలు కండెలకు చుట్టుతున్నారు. కొందరు వనితలు కళింగమునుండీ, ఆంధ్ర మంజిష్టాది దేశాలలో అనేక భాగములనుండి వచ్చిన నూలును సన్నతనం, ముతక తనమునుబట్టి కేటాయింపులు చేస్తున్నారు.

ఆంధ్రదేశంలో దూదిబట్టల పరిశ్రమ అతి పురాతనకాలంనుండీ ప్రసిద్ధికెక్కినది. పది మడతలు పెట్టి ధరించినా దేహాన్ని స్పష్టంగా కనిపింపజేయగల సన్న నూలు వడకడంలో ఆంధ్రవనితలు జగత్ప్రసిద్ధి నందినారు. ఎంత ఉత్తమకుటుంబీకు రాలయినా, వ్రతములతోపాటు, పవిత్రమైన నూలునుకూడా వడకవలసిందే! ఆంధ్రవనితల నైపుణినిబట్టి వివిధపుంజాలుగా తేలు నూలు వస్తుంది. దేశానికి కావలసిన వస్త్రాలు సిద్ధం చేయడమేకాకుండా, ఇతరదేశాలకు సరిపోయే వస్త్రాదికాలను నేసి, ఆంధ్రులు ఎగుమతి చేసేవారు.

నేతలో ఆంధ్రసాలెవా రంత కౌశలంకలవారు అఖిల భారతదేశంలో ఇంకొకరు లేరు. మానువనాటి, బుద్ధనాటిలో, పెనాదాడిలో, సిద్ధవాడిలో ఉన్నిని నూలంత సన్నంగా వడకగలిగేవారు గొల్ల భామలు. ఆ నూలును కురవసాలీలు సన్నని కంబళ్ళుగా నేసేవారు. ఆ కంబళ్ళు కాశ్మీరశాలువలకు, హిమాలయరాంకవాలకు ఏమీ తీసిపోయేవి కావు. కళింగము, దక్షిణకోసలము చక్కని దుకూలాలకు ప్రసిద్ధి. చీనాదేశాన్నుండి తళతళలాడే మెత్తని పట్టునూలు దిగుమతి అయ్యేది. కామరూపాన్నుంచి వచ్చిన పట్టునూలున్ను ఉత్తమమైనదే. ఆ పట్టునూళ్ళతో ఆంధ్ర పట్టుసాలీలు నేసిన చీనీ చీనాంబరాలు, దుకూలాలు జగత్ప్రసిద్ధి పొందినవి.

ఆంధ్రదేశంలో పట్టునూలుపై బంగారము కరగించి పూతపూసి హోంబట్టు చేయుట పురాతనకాలంనుంచీ ఉన్నది. ఈ నూలుకు పారశీకులు జరీస్‌తారు (జలతారు) అనే పేరుపెట్టారు. పారశీకవర్తకులు ఈ హోంబట్టు నూలును విపరీతంగా