పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

70

గోన గన్నా రెడ్డి

అన్నాంబిక మాటాడలేదు. అతని సమున్నతదేహము, అతని గంభీర ముఖాకృతి, రేఖామనోహరత్వము, విశాలఫాలము, లోతులై, వెడదలైన లోచనాలు, దీర్ఘ సమనాసిక, చిరుసోగమీసాలు, పెద్దచెవులు, ఆ చెవులన వేలాడే హంస కుండలాలు, పోతపోసిన కాంచనకంఠము చూస్తూనే లేచి నిలిచింది.

ఇంతటి మహాపురుషుడు దారిదోపిడికా డెట్లయినాడు? నాలుగవ ఏడు అతని తల్లి దండ్రులు పోయిరని విన్నది అన్నాంబిక. తల్లి పెంపకంలేని బాలుడు, తండ్రి శిక్షలేని కుమారుడు - పాపం! ఈ ఉత్తమపురుషుడు తప్పుదారుల పడిపోయినాడు. అయ్యో, భయంకరభటరక్షితమైన ఈ శుద్ధాంతవనానికి ఎలాగు వచ్చా డీయన! ఏపరిచారిక అయినా ఈయనను చూస్తే! రక్షకభటులకు తెలిస్తే!

“రాజకుమారీ! ఈ పెళ్ళివల్ల దేశంలో రాజద్రోహం రుద్రతాండవం చేస్తుంది. నీవు వరదారెడ్డి రాకుమారునే వివాహం చేసుకోవచ్చును కాని కొంతకాలం ఈ వివాహం కాకూడదు.”

“ఈ వివాహం ఎప్పుడూ కాకూడదు” అన్నది అన్నాంబిక. గన్నారెడ్డి ఆశ్చర్యం పొందాడు.

“ఎందుచేత?”

“నా కీ వివాహం ఇష్టంలేదు. నేను శ్రీ లకుమయారెడ్డిగారి కుమారులను నా భర్తగా ఊహించుకోలేదు. ఊహించుకోలేను.”

“అయితే మొదట ఆ వివాహానికి ఎలా ఒప్పుకున్నారు మీరు?”

“కన్యకకు తండ్రి ఆజ్ఞ అనుల్లంఘనీయము”

“ఇప్పుడు ఆ ఆజ్ఞ లేదా?”

“ఇప్పుడు మీ మాటలలో వ్యక్తమయిన చక్రవర్తి ఆజ్ఞ జనకాజ్ఞకన్న బలవత్తరమైనది ప్రభూ!”

“నేను గజదొంగను. నన్ను ‘ప్రభూ’ అనకండి.”

“నాకు మీరు గజదొంగలుకారు!”

“మీ కా వివాహం ఇష్టంకాకపోతే, రేపు ప్రధానమహోత్సవం ఏలాగు?”

“రేపు ప్రధానమహోత్సవం జరుగదు. రేపు మావాళ్ళు ప్రాణంలేని నాబొందిమాత్రమే చూడగలరని, నేను ఈ ఉదయమే నిశ్చయించుకొన్నానుప్రభూ!”

“రాజకుమారీ! అల్లా అనకండి! మీరు మీ తండ్రులకు ఏక సంతానం. వారికి గర్భశోకం కూర్చుడంకంటె పాపం యింకొకటి ఉందా? తలి దండ్రులకు గర్భశోకం కలిగించే బిడ్డలు వేయి శిశుహత్యలు చేసినవాళ్ళవుతారు రాజకుమారీ! నా మనవి వినండి. మీరు వెంటనే నాతో రండి.