పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అన్నాంబిక

69

ఉదయమందే ఆమెకు వట్టివేళ్ళనూనె తలంటి, గంధపొడి పిండి నలుగు పెట్టి, జాతీపరీమళజలాల స్నానమాడించి, మెత్తని సెల్లాల తడియార్చి వదులు జడవేసి మల్లెమొగ్గలు ముత్యాలకూర్పులా అలంకరించారు. అ మల్లెమొగ్గలు ఇప్పుడు విచ్చినాయి. ఉదయం చెలులు తన్ను ధరింపచేసిన కుసుంబా పట్టుచీర, పసిమిబంగారు స్తనదుకూలము, కమలారుణపు పట్టుచీర వెంటనే మార్చింది.

ఆ నగలన్నీ ఊడ్చింది. ఇప్పు డామె అన్నీ ముత్యాలనగలే పెట్టుకొన్నది. లాలాటికమూ పెద్దముత్యమే. అన్ని నగలూ ముత్యాలవే! ఉదయం పద్మరాగ రత్నాభరణాలు, మధ్యాహ్నం గోమేధికాలంకారాలు, సాయంకాలం ముత్యాలు కూర్చిన ఆభరణాలు దాల్చు నామె.

ఇంతలో చంద్రుడు ఎఱ్ఱటి మహాపద్మంలా తూర్పున ఉదయించాడు.

అన్నాంబికాకుమారి పడే వేదన ఆమె కేమి అర్థమవుతుంది? అన్నాంబిక పుంజీభవించిన స్వచ్ఛసౌందర్యసత్వం. స్వచ్ఛసౌందర్యశక్తిప్రవాహం కర్పూర సైకతాలపైనే ప్రవహిస్తుంది. పవిత్రహృదయభూములనే తడుపుతుంది.

అన్నాంబికాసౌందర్యమహాఝరి పోటెత్తి, పరవళ్ళెత్తి, కరడుకట్టిన మూర్ఖజనకాజ్ఞాశిలలను ఛేధించుకొని ప్రవహింప జలజలలాడుతున్నది. అది ఆ బాలిక కేమి తెలుస్తుంది!

చంద్రుడు గబగబ ఆకాశంలోకి తేలుకొని వచ్చాడు. చంద్రునివైపుచూస్తూ కృష్ణతదియనాటి చంద్రుడు రాకాచంద్రునికన్న అందము తక్కువవాడా అనుకుంటూ, గజదొంగ గోన గన్నయ్య కృష్ణతదియనాటి చంద్రుడు అతడు రాకాచంద్రుడు కాలేడా అనుకుంటూ అన్నాంబిక ఇటు తలతిప్పింది.

నవ్వుతూ ఎదుట గోన గన్నారెడ్డి నిలిచి ఉన్నాడు.

4

అన్నాంబికకు ఒక్క నిమేషం ప్రాణచలన మాగిపోయింది.

గన్నారెడ్డి వసంతమూర్తిలా, రూపంపొందిన యౌవనంలా, పోతపోసిన వీరత్వములా, ఉత్తమశిల్పి ఊహలోని ధీరోదాత్తపురుషునిలా చిరునవ్వుతో నిలుచుండి, అన్నాంబికకు నమస్కరించి, తీయని మందర స్థాయిలోని షడ్జమస్వరంతో “అన్నాంబికాదేవీ! ఈ గజదొంగను చూచి భయపడకు, నీకు కాకతీయవంశం అంటే భక్తి ఉన్నదా? అని ఒక ప్రశ్న. రెండవది, మీకు శ్రీ గణపతిరుద్ర సార్వభౌములన్నా, శ్రీ రుద్రమహారాజు లన్నా భక్తిఉన్నదా? మూడవప్రశ్న, ఈ మహాదేశంలో ధర్మం నాలుగు పాదాలా నడవాలని ఉన్నదా అనీ - ఈ ప్రశ్నలు అడుగుతున్నాను” అని కొంచెం విషాదచ్ఛాయలు తోచే వాక్యాలతో అడిగాడు.