పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

గోన గన్నా రెడ్డి

ఉప్పల సోముని తలగొండుగండడు, వందిభూపాలుని ప్రాణాపబోరుడైన ఒక భయంకరవ్యక్తి ఆ మహోత్సవమధ్యమందు నిలుచుండి పకపక నవ్వుతూన్నట్లు ప్రత్యక్షమైనాడు. ఆమెగుండె దడదడమనగా కళ్ళు మూసికొన్నది. ఆ దర్శనము మాయమైనది.

ఆత డంత భయంకరుడా! మరి అతని మోము ఎంత ప్రసన్నంగా ఉన్నది! అతడు చిరునవ్వు నవ్వని నిమేషం ఒకటైనా ఉండగలదా? మొదటి ముహూర్తంనాడు తనకు ప్రత్యక్షమైన ఆ మహాభాగుని రూపమే నేడు ఛాయామాత్రంగా ప్రత్యక్షంకాగా ఆమె అనుకొన్నది.

ఎంత ఉన్నతమూర్తి! అతడు గజదొంగా! ఎక్కడ దొంగతనం చేసినా డాయన? ఎందువల్ల? ఏమిటా గజదొంగతనం? ఇం దేదో మహా రహస్యం ఉన్నది. ఆ మహాపురుషుని మూర్తిలో, మోములో, చూపులో గజదొంగతనం ఏది? గజదొంగలు అందంగా ఉండగలరా? ఆసురికమైన సౌందర్యము హిరాణ్యాక్షునిలా, దుర్యోధనునిలా తామసికమై ఉంటుంది.

గన్నారెడ్డి ద్రౌపదిస్వయంవరంనాటి అర్జునునిలా ఉన్నాడు. అతడు ఆ దినమందు తాను తెర తొలగించినప్పుడు తన్నంత కరుణతో చూచినాడు. ఆ చూపులలో వెన్నెల కిరణాలు ప్రసరించినవి. ఆ చూపులలో సామగానాలు వెల్లివిరిసినవి. ఆ చూపులలో విశాలాక్షీదేవి నవ్వులు ప్రకాశించినవి.

అటు ఉప్పల సోమున వధించి, వెంటనే సైన్యంతోవెళ్ళి కందవోలు ముట్టడించి, కోటలోనివారందరూ ఏమరుపాటున ఉండగా కోటలో ప్రవేశించి ప్రభువును బందీ చేసినాడట! ఈ గాథను కందవోలునుంచి అంచెలమీద వార్త తెచ్చిన చారుని చెల్లెలయిన తన అలంకారిక చంచలాక్షి చెప్పింది.

వందిభూపాలుడు కర్కోటకుడు. తన ప్రజలను ధర్మహీనుడై అనేక బాధలకు లోనుజేసిన క్రూరకర్ముడు. తనతండ్రి ఈనాడు శ్రీ గణపతిదేవ సార్వభౌముని పై, రుద్రదేవమహారాజుపై కత్తికట్టినారే! కాని చక్రవర్తి అంటే పరమభక్తితోకొలిచే దినాలలో, తనకు పదమూడుసంవత్సరాల ఈడు ఉన్నప్పుడు వందభూపాలుడు రాజుకాడు, రాక్షసుడు అని అనేవారే! అలాంటిది, ఈ దినాలలో ఆయనకు తండ్రిగారు స్నేహితులైనారు. వెంటనే గోన గన్నారెడ్డి చేతిలో హతమారిపోయినాడు.

కందవోలులో మహాసభచేసి వందిభూపాలుల విచారించినారట. ప్రజలందరూ భయముతీరి, తమ కా వంది చేసిన అన్యాయాలు, అవమానాలు చెప్పినారట. అయినా వందిభూపాలుని కాశీకి పోవలసిందని గన్నారెడ్డి హితవు గరపినాడట. వందిభూపాలుడు గణపతిదేవ ప్రభువును, గోన బుద్ధారెడ్డి ప్రభువును, గన్నారెడ్డిని, విశ్వేశ్వర శివదేశికులను అనరానిమాట లన్నాడట. అంతవరకూ గోన గన్నయ్య నవ్వుతూనే ఉన్నాడట. అప్పుడా వందిభూపాలుడు శ్రీశ్రీ రుద్రదేవప్రభువును, “తుచ్ఛివాంఛలు తీర్చుకోడానికి పురుషవేషం