పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

గోన గన్నా రెడ్డి

అయినా ఇరువదిరెండేళ్ళ ఈడుగల ఆ యోషకు బంగారురంగులో కాశ్మీర కుసుమవర్ణమూ, జపాకుసుమవర్ణమూ రంగరించి, దిరిసెనపూవు మెత్తదనము కలిపినట్లున్న దేహసౌభాగ్యము చూచి ఆ మార్జనికులు ఉప్పొంగిపోతూ ఉంటారు. జవ్వనము తొంగిచూచుబాలిక కోరికలలా, వెన్నెలలోనికి నీటిలోనుండి తొంగి చూచు కాలు ఎఱ్ఱకలువ మొగ్గలులా ఉన్న ఆయమ మేలిమి పసిడివక్షోజాల శిఖరితములైన చూచుకాలు కాళిదాస శాకుంతల నాటకంలో నాల్గవ అంకంలోని "శుశ్రూషస్వ గురూన్", "యాస్యత్యద్య శకుంతలేతి" అనే శ్లోకాలులా ఉన్నాయి.

ఆమె దేహము ద్రఢిమాయుతము, లాలిత్యయుతమున్ను. ఆమె దేహము స్పష్టాంగరేఖాసమన్వితము. మాధవీలతవలె, కల్పవృక్షశాఖవలె ఆమెచేతులు మృదులములు, పుష్టిమంతములు. శుంభ నిశుంభాదులపై చెవికంట బాణయుక్తమగు వింటి నారినిలాగు లలితాదేవీహస్తా లా చేతులు.

రుద్రదేవి అతిలోకసుందరమగు తన వనితారూప మావేళ గమనించు కొన్నది. ఇదివర కేనాడు లేనిసిగ్గు ఆమెను ఆవరించి, దేహమంతయు అరుణమైనది. ఆ సిగ్గుతో ఆమె తన కన్నులు మూసికొన్నది. ఆమెలోని పురుషభావము, ఆమె రూపంలోని దిగంబరవనితాదేహాన్ని చూచి సిగ్గుపడి కన్నులు మూసుకొన్నది.

రుద్రాంబిక స్నానము పూర్తిగావించి, వలిపవస్త్రములు ధరించి అలంకార మందిరానకు పోయి పీఠ మధివసించగానే, చెలులు పరిష్కర్త్రికలు ఆ దేవిని అత్యంతమధురంగా అలంకరించారు.

ఇరువదిరెండేండ్ల సంపూర్ణ స్త్రీ! బాల్యం ఇసుమంతా తరుగని బ్రహ్మచారిణి. పారిజాతపుష్పంలా నిత్యవికసితయౌవన. ఆస్వాదన కోరని పరిమళము. తుమ్మెదను కాంక్షించని దివ్యపుష్పము.

స్నానంచేసి అలంకరింపబడి ఆ దేవి దర్పణంలో ఎవరినో ఒక లాతి సుందరీరత్నాన్ని చూచికొన్నది. ఆ ప్రతిబింబంలోని బాల తా నెరుగనిది! ఆ ప్రతిబింబంలోని బాల అప్పుడే జవ్వనంపొందిన నవయోష! ఆ ప్రతిబింబంలోని మనోహరాంగి సముద్రసంగమానికి ఉప్పొంగి వరదలై ప్రవహించి వచ్చే నదీ సుందరి! ఆ ముకురంలోంచి తన్ను అరమూతకన్నులతో పరిశీలించు మధురాధర ఏదో మహానుభూతికై ఎదురుచూచు పరమహంసి.

ఆ దర్పణంలోఉన్న సముజ్వలమూర్తి తన్ను చూచి “ఓ బాలికా, ఇక నువ్వు బాలుడవు కాదు. నువ్వు మహారాజువుకాదు. నువ్వు మాయా పురుషత్వం వీడిన శోభాపూర్ణ నవవధువువు! నువ్వు నీ వరునికొరకై ఎదురు చూస్తున్నావు.