పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రుద్రదేవి

35

నీ ఇంద్రజాలం మాని మహాంధ్రభూమిలో నచ్చిన పురుషుణ్ణి కోరుకో” అన్నట్లయినది.

రుద్రదేవి చిరునవ్వు నవ్వుకొన్నది. ఆమె ఆడవారిలో పొడుగైన బాలిక. కత్తియుద్ధంలో, బాణయుద్ధంలో, పరశు భల్ల యుద్ధాలలో దేశంలోని ఏ ఇద్దరు ముగ్గురు వీరులో ఆమె ఢాక కాగగలరు. యుద్ధవ్యూహ రచనంలో ఒక్క జన్నిగదేవ త్రిపురాంతకదేవు లామెకు మిన్న అవుతారేమో!

పురుషవేషము ధరించినప్పుడే ఆమెలో స్త్రీభావము మాయమౌతుంది. కవచము, ఉష్ణీషము ధరించి, ఆయుధోపేతయై ప్రియమగు అజానేయ మారోహించినప్పు డామె అతిపురుషుడు. ఏమాత్రము శంకలేని మహావీరుడగు పురుషుడు. ఆ అశ్వము ఆకాశము అంటేటట్లు ఎగిరినా, లోకాలను ఆవరించేటట్లు దుమికినా, మహావాయువుతో పందెంవేసినట్లు పరుగిడినా ఆ బాలిక చెక్కు చెదరదుకదా! ఎంతో మహానందాన్నిపొంది, ఎగురులో, పరుగులో భాగమై, ఆకాశరాజై, గ్రహాల మేటియై, వాయువే అయి సర్వవిశ్వానికి నాయకత్వం వహిస్తుంది. అప్పు డామె విశాలమైన కళ్ళు ఆదిత్యద్వయం, అప్పుడామె మందారకుట్మలనాస పాశుపతాస్త్ర జ్వాల, అప్పు డామె బింబాధరాలు విడివడిన ప్రళయాగ్ని శిఖలు, ఆరుద్రదేవుని యెదుర్కొన సాహసించగలిగినవా డొక్క రుద్రుడే!

పురుషవేష మింటికడను ధరించుచుండును. ఆమె బాలికయని ఆ అభ్యంతరాంతర మందిరాల మెలిగే అరవై మంది స్త్రీలకు, మహారాణులకు, చక్రవర్తికి, శివదేవయ్యకు మాత్రమే యెరుక. తక్కినవారికి అనుమానము మాత్రము.

ఆమె పదునెన్మిదేడుల ఈడున అర్ధసింహాసనారూఢయై యున్నప్పుడు సభలో చాళుక్య వీరభద్రుని ఆయన తండ్రిప్రక్క చూచినది.

అప్పుడు శ్రీ శ్రీ గణపతిరుద్రదేవచక్రవర్తి జన్మదిన మహోత్సవానికి శ్రీ శ్రీ నిడుదప్రోలు చాళుక్యమహారాజు ఇందుశేఖరుడు పెద్దకుమారునితో పాటు చక్రవర్తిని దర్శించడానికి వచ్చినాడు. చాళుక్యవీరభద్రున కప్పు డిరువదియొకటవయేడు.

ఆ మహాసభలో చాళుక్యవీరభద్రుడు ఆకాశాన సూర్యదేవునివలె ఒక్కడే ప్రత్యక్షం అయినాడు రుద్రదేవికి.

ఆ రుద్రదేవుడైన రుద్రదేవికి ఒక నిమేషం హృదయస్పందన మాగిపోయినది. వెనువెంటనే యుద్ధభేరీనినాదం మ్రోగుట ప్రారంభించినది. ఆమె అన్నియు మరచి కవుల గంభీరకావ్యగానములు వినక, నర్తకీబృంద మధుర నృత్యాలు గమనించక వీరభద్రునే చూచుచున్నది. వీరభద్రుడు యువరాజును చూచుట కదే మొదటిసారి. చక్రవర్తికుమారుడు రుద్రదేవుని యందము లోకాతీత విషయంగా పండితు లాడుకొనుట వీరభద్రుడు విన్నాడు.