పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

322

గోన గన్నా రెడ్డి

ఆ ఉదయం చక్రవర్తి, గోన గన్నారెడ్డిప్రభువును రప్పించి “ప్రభూ! ఈ సాయంకాలం రాచనగరి మోసాలలో పదునాల్గవ ముహూర్తము కొట్టు నప్పటికి మీరు మా ప్రతీహారి చూపించిన స్థలమునకు పోయి, అక్కడ నేను కలుసుకొనడానికి నియమించిన వ్యక్తిని కలుసుకొని, నా యాజ్ఞగా మీరు ఆ వ్యక్తి కళ్ళకు కట్టిన చీనాంబరము విప్పవలెను. ఆ వ్యక్తి నా ఆజ్ఞ మీకు తెలియజేయగలదు.”

గోన గన్నయ్య జయ వాక్యాలు పలికి సెలవంది వెడలిపోయెను. ఏమిటి చక్రవర్తి ఆజ్ఞ! ఇంత రహస్యమేమి? ఒకవేళ కోటారెడ్డి మహారాజు వేరే ఏమీ కుట్ర సలుపడము లేదుకదా? అయితే ఈ వివాహాది సన్నాహమేమిటి?

అక్కినేపల్లి

చినఅక్కినమంత్రి శ్రీ కోటారెడ్డిప్రభువులతో సంప్రదించి, వారిమంత్రి పురోహితులతో ఆలోచించి ముహూర్తము నిశ్చయముచేసిరి. గన్నారెడ్డి వివాహము కాగానే ఇంకో శుభముహూర్తంలో తన రాణితో కలసి పశ్చిమాంధ్రరాజ్య ప్రతినిధి మహామండలేశ్వర సింహాసనం, వర్థమానపురంలో అధివసించే ఏర్పాటు చేసెను, అక్కిన.

చక్రవర్తి, గోన గన్నయ్య, కోటారెడ్డి ప్రభువులు అక్కినప్రగడను ఒక మండలానికి రాజును చేసినారు. అక్కినప్రగడ తన రాజ్యంలో అక్కినేశ్వరము కట్టించి (ఇది తర్వాత అక్కనేపల్లి అయినది) అచ్చట అక్కినేశ్వర, సోమేశ్వర, కేశవదేవతలను ప్రతిష్ఠించినాడు. అక్కినను గోన గన్నయ్యకు ముఖ్యమంత్రిగా గోన గన్నయ్యమహారాజు ప్రార్థించినాడు. చినఅక్కినప్రగడ “బావగారూ! మిమ్ము వదలి నేను ఉండలేను. నేనే మీ ఆస్థానమందుండబోకోరుతున్నాను” అన్నాడు.

“ఓ మహామంత్రీ! మహాకవీ! చక్రవర్తి ఆస్థాన శిరోరత్నంగా ఉండవలసిన మీరు నాకు మంత్రిత్వం చేయ నంగీకరించటం నాకు వరమివ్వడమే.”

అక్కిన లేచి గోన గన్నయ్యదగ్గరకు వెళ్ళగా మహారాజు లేచి, అక్కినను గాఢంగా హృదయానికి అదుముకొన్నాడు.