పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జయీభవ

321

గోన గన్నారెడ్డి మోము వికసించినది. ఆయన కన్నుల అమృతనీలాలు తిరిగినవి. గొంతుక అమృతబిందువులతో నిండిపోయి డగ్గుత్తికతో “మహామంత్రీ! మహారాజులు నన్ను ఈవిధంగా ధన్యుని చేస్తున్నారు” అన్నాడు.

ఆ సమయంలో గోన గన్నారెడ్డిప్రభువు, కోటారెడ్డిప్రభువుకు శ్రీరామచంద్రమూర్తిలా తోచినాడు. గన్నారెడ్డిమాటలు ముగుస్తుండగానే మంత్రిలేచి “తథాస్థు” అన్నాడు. వెంటనే రాజపురోహితులు, కవులు ఆ మందిరం లోనికి పరిజనులతో వేంచేసినారు. బేడ చెలుకినాయనిప్రభువు లోనికివచ్చి బంగారు పళ్ళెరాన కొబ్బరిబోండం, సర్వఫలాలు, పుష్పాలు, తాంబూలాలు, విలువగల వస్త్రాదులు గన్నారెడ్డి పీఠముముం దుంచినారు. గన్నారెడ్డి ఆశ్చర్యం పొందుచూ లేచి, కాబోవు మామగారు కోటారెడ్డి ప్రభువుకూ, పెళ్ళికూతురు మేనమామ బేడ చెలుకి నాయనికీ పాదాభివందన మాచరించగా వారు గన్నారెడ్డిని ఎత్తి తమ హృదయాలకు గాఢంగా అదుముకొంటూ ఆలింగనం చేసినారు.

శుభవాద్యాలు, మంగళగీతాలు మ్రోగుచున్నవి.

8

జయీభవ

చిన్నకుట్ర

ఆ తోటలో అక్కడే గోన గన్నారెడ్డి అన్నాంబికను కలసికొన్నాడు.

అందాలప్రోవైన అన్నాంబిక, అలంకారాలకే అందం దిద్దింది.

ఆమె వనవిహారం చేసింది. ఆ సాయంకాలం పూవుల వాసనలు తోటంతా కల్లోలాలు. ఆ పరిమళవాహినిలో హంసలులా, రుద్రదేవి అన్నాంబికలు నడయాడినారు.

“చెల్లీ! నేను దాక్కుంటాను. ఇక్కడే కళ్లు మూసుకుఉండు” అని రుద్రంబికాదేవి మాయమయింది.

అక్కడే గన్నారెడ్డిని తాను కలుసుకొన్నది అని ఇదివరకే అన్నాంబిక రుద్రాంబతో చెప్పిఉండడంచేత అక్కడే ఆమె కనులు మూసుకొని, రుద్రాంబిక దాగికొనినపిమ్మటకనులు తెరచి వెదకి పట్టుకొనవలెనని మహారాణి ఏర్పాటుచేసినది.