పుట:Gona gannareddy, Adavi Bapiraju.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

గోన గన్నా రెడ్డి

మారయ: చిత్తం! వేనుని చరిత్ర మనం ఎల్లా మరచిపోగలం? కాబట్టి మా ప్రభువు హరిహరదేవులు న్యాయంగా రావలసిన తమరాజ్యం తమ కిప్పించ వలసిందని తోటి మండలేశ్వరుల నందరినీ హెచ్చరిస్తున్నారు.

లకుమయారెడ్డి: మారయప్రెగ్గడవారూ! తాము చెప్పినది మాకు నచ్చినది. తమ ప్రభువులకు బాసటగా నిలిచే ఇతర సామంతు లెవరు? ఎంతమంది?

మారయ: ప్రభూ! రేనాటిలో శ్రీపతిప్రభువు, సకిలి ఎరువలో గణపతిసాహిణి మనకు మాట ఇచ్చారు. వారు అంబయదేవుని తుదముట్టిస్తారు. విజయగండ గోపాలుడు కమ్మనాటిలో, ఎరువమాను మిలిదేవరాజు పాకనాటిలో, పొత్తపినాటిలో సిద్ధయ చోడరాజు హరిహరదేవ మహాచక్రవర్తికి సహాయం చేసితీరుతామనీ, త్రిపురాంతక, జన్నిగదేవులను నాశనం చేస్తామనీ మాటయిచ్చారు. గుంటూరులో నాగదేవరాజు మా ప్రభువుకు సర్వసహాయం చేయడానికి మాట పంపించారు.

లకుమయారెడ్డి లేచి మారయమంత్రివరునకు రుద్రయామాత్యులవారు ఆతిథ్యం నెరవేర్పవలసిందనియు, శ్రీ హరిహరదేవ ప్రభువుల పక్షాన మారయామాత్యులు, తమ పక్షాన రుద్రయామాత్యులు అగ్నిప్రమాణ మైత్రి నెరవేరపవలసిందనిన్నీ చెప్పి తమ అభ్యంతరమందిరంలోకి వెళ్ళిపోయినారు.

లకుమయారెడ్డి లోనికిబోయి దాసీజనసహాయంతో మళ్ళీ స్నానం చేసిన వారై, శుభ్రవస్త్రాలు ధరించినవారై, పూజాపీఠంముందు కూర్చుండి విష్ణుపూజ నెరవేరుస్తుండిరి. గోనవారు అద్వైతులు, విష్ణుపూజాపరులు, గోనలకుమయారెడ్డి తాతగారు బుద్ధమహారాజు పశ్చిమచాళుక్యులకు సామంతుడుగా భువనగిరిదుర్గంలోఉండి పరిపాలనం చేసే రోజుల్లో బౌద్దమతము స్వీకరించినాడు. ఆయన కుమారుడు గోన క్షేమరాజు వైష్ణవం స్వీకరించి రంగనాథ నామం స్వీకరించి, బుద్ధదేవుడు విష్ణువునకు తొమ్మిదవ అవతారమని నమ్మి తన పెద్దకుమారునకు బుద్ధారెడ్డి అనిన్నీ, చిన్న కుమారునకు లకుమయ అని లక్ష్మణదేవర పేరు పెట్టుకోన్నాడు.

లకుమయకు భగవంతునిపై హృదయము లగ్నముకాదు. అతడు ఎంతో కళవళపడుచుండెను. ఎనుబదిఏళ్లు నిండిన గణపతిదేవ సార్వభౌముల పండువంటి రూపము ఎదుట ప్రత్యక్షమవుతున్నది. శ్రీకృష్ణదేవునికున్నట్లు అష్టభార్యలున్నా చక్రవర్తికి ఒక్క బాలుడైనా కలుగలేదు. పట్టపుదేవి సోమాంబామహారాణికి ఇద్దరు బాలికలు ఉద్భవించారు. వారైనా ఆయన ఏభైతొమ్మిదోయేటా, అరవై రెండవయేటనూ ఉద్భవించారు. జాయపసేనాని అక్కలు నారాంబా, పేరాంబాదేవులకు ఇరువురకూ సంతానమే లేదు.